Saturday, 1 November 2014

వారెన్ ఏండర్సన్ దొరగారి ఆత్మ శాంతించుకాక!


యూనియన్ కార్బైడ్ పెద్దమనిషి వారెన్ ఏండర్సన్ దొరగారు చనిపోయ్యార్ట. ముప్పైయ్యేళ్ళ క్రితం - ఈ ఏండర్సన్ దొరగారి వల్ల నాకు అప్పటిదాకా తెలీని చాలా సంగతులు తెలిశాయి. అప్పటిదాకా భారద్దేశం సర్వస్వతంత్ర దేశమనీ, ఈ దేశంలో అన్యాయాలు, అక్రమాలు పెద్దగా శిక్షింపబడకపోయినా.. ఘోరమైన, దారుణమైన, దుర్మార్గమైన నేరాలు మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతాయని నమ్మేవాణ్ని.

అయితే - నేరం చేసేవాడు ఒక శక్తివంతమైన దేశానికి చెందినవాడైతే.. శిక్ష సంగతి దేవుడెరుగు.. వాణ్ని కనీసం విచారణ బోనులో కూడా మనం నిలబట్టలేమని నాకు అర్ధమయ్యేట్లు చేసిన మహానుభావుడు వారెన్ ఏండర్సన్ దొరగారు.

పొనీ - ఆ దొంగేమైనా 'గ్రేట్ ఎస్కేప్'లో స్టీవ్ మెక్వీన్‌లాగా అష్టకష్టాలు పడి పారిపోయాడా (పాపం! చివర్లో స్టీవ్ మెక్వీన్ దొరికిపోతాడు) అంటే అదీ కాదు! సాక్షాత్తు ప్రధానమంత్రిగారి కనుసన్నల్లో, ముఖ్యమంత్రిగారి దర్శకత్వంలో దర్జాగా, దొరబాబులా నడుచుకుంటూ విమానం ఎక్కేసి వెళ్ళిపొయ్యాడు.

అంచేత - మన దేశం ఒక సర్వస్వతంత్ర దేశం అని ఇంకా చెప్పుకుంటున్నాం అంటే మనకి సిగ్గైనా లేకపొయ్యుండాలి లేదా ఆ పదానికి అర్ధమైనా తెలీకపోయ్యుండాలి. ఎవరికైనా భ్రమలుంటే వారికి నా సానుభూతి! ఒక బహుళజాతి సంస్థ ముందు మన ప్రభుత్వాలు బానిసల్లా ఎంతగా సాగిలిపడతాయో అర్ధం చేసుకోడానికి ఈ వారెన్ ఆండర్సన్ ఉదంతం ఒక కేస్ స్టడీగా పనికొస్తుందని నా అభిప్రాయం. 

బురదలో జీవించే సూడిపంది తన పిల్లల జోలికొస్తే పీకి పాకం పెడుతుంది. ఒక వీధికుక్క తన పిల్లల్ని ముట్టుకుంటే కండ వూడేట్లు కొరికి పడేస్తుంది. అలాగే అనేక జంతువులు తమ సంతానాన్ని ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకుంటాయి. మన ప్రభుత్వాలకి మాత్రం - ఈ దేశపౌరులు ఎన్నో ఆశలతో తమకి వోట్లేసి గెలిపించుకున్నారనీ, వారి భద్రతకి తాము పూచీ పడ్డామన్న స్పృహ వుండదు, లెక్కుండదు. అందుకే వాటికి ఇంత బరితెగింపు!

ఒకళ్ళా ఇద్దరా? వందా రెండొందలా? కొన్నివేలమంది తమ పౌరులు మృత్యువాత పడ్డా మన ప్రభుత్వాలకి చలనం లేదు. వాటికి తమ వర్గ ప్రయోజనాలే ముఖ్యం, తమ ప్రభువుల సేవే పరమార్ధం! అవును మరి - మనది కర్మభూమి, ఇచ్చట జనన మరణాలు దైవనిర్ణయం. కావున - యూనియన్ కార్బైడ్ తనవంతు కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది. చచ్చినవాడు నష్టజాతకుడు, అంతే! అందుకే - వేలమందిని పొట్టబెట్టుకున్న ప్రధాన నిందితుణ్ణి మనవాళ్ళు సగౌరవంగా సాగనంపారు!

ఈ దేశంలో అధర్మం, అన్యాయం, అక్రమం, అవినీతి నాలుగు పాదాల మీద నడుస్తాయని తెలిజెప్పిన వారెన్ ఏండర్సన్ దొరగారికి, రాజీవ్ గాంధీగారికీ, అర్జున్ సింగుగారికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా! మీరంతా నాలాంటి అజ్ఞానిని రాత్రికిరాత్రే జ్ఞానిగా మార్చేశారు. లేకపోయినట్లైతే - ఈ విషయం అర్ధం చేసుకునేందుకు ఎన్నో పుస్తకాలు చదవాల్సొచ్చేది, ఎంతో ఆలోచించాల్సొచ్చేది. ఆ గోలేమీ లేకుండా నాకు చాలా సమయం ఆదా చేశారు. అందుక్కూడా మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను! థాంక్యూ!

వారెన్ ఏండర్సన్ దొరగారి ఆత్మ శాంతించుకాక!