Monday 10 November 2014

ఆకలి - అజ్ఞానం


అవి నేను ప్రాక్టీసు మొదలుపెట్టిన రోజులు. నాది పూర్తిగా పట్టణ నేపధ్యం. అంచేత గ్రామాలకి సంబంధించిన విషయాలేవీ నాకు తెలిసేవి కావు. ఒక పట్టణం అనేది అనేక గ్రామాలకి కేంద్ర స్థానమనీ, అందువల్ల - పేషంట్లలో ఎక్కువమంది గ్రామాల నుండే వస్తారనీ తెలుసుకున్నాను. గ్రామీణ పేషంట్లతో ఇంటరాక్ట్ అవ్వడం నాక్కొంచెం ఇబ్బందిగా వుండేది.

వ్యవసాయ పనులైన - నాట్లు, కలుపులు లాంటి పదాలకి అర్ధం వాళ్ళనే అడిగి తెలుసుకునేవాణ్ని. కొందరు పేషంట్లు ఓపిగ్గా వివరించేవాళ్ళు, ఇంకొందరు - 'వీడికి వ్యవసాయం గూర్చే తెలీదు! ఇంక మనకి వైద్యమేఁం చేస్తాడు?' అన్నట్లు నావైపు అనుమానంగా చూసేవాళ్ళు.

గ్రామీణ యువతులు చూడ్డానికి చిన్నగా వుంటారు. అందుక్కారణం - వారికి చాలా చిన్నవయసులోనే పెళ్లైపోతుంది. ఆ చిన్నవయసులోనే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేస్తారు. అంచేత వారి శరీరంలో ఎదుగుదల వుండదు. పాలిపోయిన మొహాల్తో, ఎండిపోయిన డొక్కల్తో బలహీనంగా, హీనంగా కనబడ్తూ వుండేవారు. 'వీడికీ మాత్రం తెలీదా?' అని మీలో కొందరికి అనిపించొచ్చు, ఇంకొందరికి నా అజ్ఞానం సిల్లీగా కూడా అనిపించొచ్చు. కానీ ఏం చేసేది? నిజంగానే నాకేమీ తెలీదు!

అంతేనా? వాళ్లకి మందులు రాసేప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాణ్ని. ఆ స్త్రీలు పెళ్ళై పిల్లలున్నవారు, కావున - టెక్నికల్‌గా వాళ్ళని పెద్దవాళ్ళు(ఎడల్ట్స్)గా పరిగణించాలి. కానీ - శరీర బరువు రీత్యా చూస్తే వాళ్ళు చిన్నపిల్లల కేటగిరీలోకొస్తారు! ఇంతకీ - వాళ్ళు పిల్లలా? పెద్దలా? ఎవరనుకుని మెడిసిన్ రాయాలి?

ఇటువంటి సమస్యల గూర్చి సైకియాట్రీ టెక్స్ట్ బుక్సులో రాయరు. మొత్తానికి ఏవో తిప్పలు పడి ప్రిస్క్రిప్షన్ రాసేవాణ్ని.

అంతా అయ్యాక - చివరాకరికి వాళ్ళు "బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అనడిగేవారు!

జీవితం గూర్చి నాది పూర్తిగా పుస్తకాల జ్ఞానమే! ఆకలి, కష్టాలు వంటి పదాలకి అర్ధం తెలీదు. పంట పొలాల్ని, గ్రామాల్ని రైల్లోంచి చూసిన అనుభవం మాత్రమే వుంది. గ్రామీణ పేదల జీవితాల్ని అర్ధం చేసుకోడానికి నా దగ్గరున్న ఏకైక టూల్ - సాహిత్యం! ఎమిలి జోలా 'ఎర్త్' (ఈ నవల్లో దరిద్రానికున్న దుర్మార్గపు యాంగిల్ దారుణంగా వుంటుంది), పెర్లస్ బక్ 'గుడ్ ఎర్త్' (ఈ నవల్లో దరిద్రం కొంత డీసెంటుగా వుంటుంది) వంటి నవలల పరిజ్ఞానం మాత్రమే!

నాకు వారి 'స్టానిక్' అజ్ఞానానికి జాలేసేది! లాభం లేదు, నా దేశప్రజల అజ్ఞానమును నా జ్ఞానమనే టార్చి లైటుతో పోగొట్టవలననే సత్సంకల్పంతో, సదాశయంతో - 'నేను సైతం, నేను సైతం' అనుకుంటూ - ఉత్సాహంగా గొంతు సవరించుకుని - 'పోషకాహారం అనగానేమి? అందువల్ల కలుగు లాభములేమి?' అంటూ ఓ మంచి క్లాసు పీకేవాణ్ని! ముక్తాయింపుగా - బీ కాంప్లెక్స్ మందులు వాడటం శుద్ధదండగని అమూల్యమైన సలహా ఇచ్చేవాణ్ని.

'సరైన ఆహారం లేకపోడమే మీకున్న రోగం. రోజూ రెండు గుడ్లు తినండి, గ్లాసుడు పాలు తాగండి. బ్రహ్మాండమైన బలం వచ్చేస్తుంది.'

వారు నా ఉపన్యాసాన్నంతా ఓపిగ్గా విని -

"బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అని మళ్ళీ అడిగేవారు. నాకు చికాగ్గా అనిపించేది.

'ఓ ప్రభువా! నా దేశప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేసేది? ఎలా? ఎలా?' అంటూ సమాధానం లేని ప్రశ్నల్ని వేసుకుని జుట్టు పీక్కునేవాణ్ని.

అలా నా అజ్ఞాన పేషంట్లకి అనేక ప్రవచనాలు ఇస్తూ ఇస్తూ, దాదాపు అన్నిసార్లు ఓడిపోతూ పోతూ - కొన్నాళ్ళకి నేను పెద్దమనిషినయ్యాను. ఈలోగా - నాలో జ్ఞానకిరణాలు మునిసిపాలిటీ వీధి దీపంలా ఆలస్యంగా వెలిగాయి.

ఆ జ్ఞానకిరణాలేమనగా -

ఆ స్త్రీలు వ్యవసాయ కూలీలు. వారి జీవితంలో తీయనైన అనుభూతులుండవు (గొడ్డుకారం మాత్రమే వుంటుంది). వారికి సుఖం తెలీదు, పరమాన్నం తెలీదు, బిరియానీ తెలీదు, సినిమాలు తెలీదు, షికార్లు తెలీదు, అన్నింటికన్నా ఆశ్చర్యం - మన మధ్యతరగతి వారు బహు బాగా ఎంజాయ్ చేసే సంగీత సాహిత్యములన్న అసలే తెలీదు!

అలా అని వారికి ఏదీ తెలీదని కాదు, వారికీ కొన్ని తెలుసు. రోజంతా ఎండలోపడి నడుములిరిగేట్లు కూలి పన్జెయ్యడం తెలుసు. పచ్చడి మెతుకుల రుచి తెలుసు. అర్ధాకలి తెలుసు, కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. జీవితాన్ని బాధగా, భారంగా ఎలా నెట్టాలో తెలుసు.

వారికి - కోడిగుడ్డు, పాలు 'బలం' అని కూడా తెలుసు. కానీ - అవి వారికి అందని ద్రాక్ష పళ్ళు. వాళ్ళది పసిపిల్లలకే సరైన ఆహారం పెట్టుకోలేని దుస్థితి. అందువల్లనే ఒక 'స్టానిక్' బలం మందు తాగేసి.. షార్ట్‌కట్‌లో పోషకాహారం లేని లోటు తీర్చుకుందామనే ఆశ! ఇన్నాళ్ళూ ఇంత చిన్న విషయం తెలీంది నాకే!

వాళ్ళు నండూరి సుబ్బారావు ఎంకిపాటలా చిలిపిగా వుండరు, వడ్డాది పాపయ్య వర్ణచిత్రంలా వయ్యారంగా వుండరు, బాపు బొమ్మలా అందంగా వుండరు. మరెలా వుంటారు? సత్యజిత్ రే హీరోయిన్లా బోల్డంత పేదగా, మురికిగా వుంటారు. మా.గోఖలే కథలా వాస్తవంగా వుంటారు. ఆరు సారాకథల ముత్యాలమ్మలా తెలివిగానూ వుంటారు. 

ఆ స్త్రీలలో చాలామందికి రాత్రిళ్ళంటే భయం. వారి భర్తలకి వీరి ప్రవర్తన పట్ల 'అనుమానం'! అందువల్ల  ఆ భర్తోత్తములు రాత్రిళ్ళు పూటుగా తాగొచ్చి, నాటుగా భార్యల్ని కొడతారు.

'అప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్లిపోవచ్చుగా?' అని ఆశ్చర్యంగా అడిగేవాణ్ని!

ఇట్లాంటి గొప్ప సందేహాలు పుస్తకాల ద్వారా ఆకలిని అర్ధం చేసుకుందామనుకునే అజ్ఞానులకి మాత్రమే కలుగుతాయనుకుంటా! ఎంతైనా - మధ్యతరగతి అజ్ఞానానికి అవధులుండవు!

'ఎళ్ళొచ్చు! కానీ - ఆడింకా గోరం. మా నాన రోజూ తాగొచ్చి అమ్మని సావకొడతా వుంటాడు. మా వదిన ఒకటే తిట్టుద్ది. అది తిండిక్కూడా గతిలేని పాడుకొంప. ఆడా బాదలు పడేకన్నా - ఆ చావేదో ఈడే చస్తే పోద్ది!'

వారిది చాలా ప్రాక్టికల్ థింకింగ్. నో నాన్సెన్స్ ఎప్రోచ్. (మనలా) ఆలోచనలో జీళ్ళపాకం సాగతీతలుండవు. థియరీ ఎండ్ ప్రాక్టీసులో అంతరాలుండవు. స్పష్టమైన అవగాహన, ముక్కుసూటి ఆచరణ వారి సొంతం.

ముగింపు -

పుస్తకములెన్ని చదివిననూ పాండిత్యము మాత్రమే వచ్చును గానీ, జ్ఞానము రాదు. తమ ఆకలి కబుర్లతో నా అజ్ఞానాన్ని పారద్రోలిన ఎందరో పేషంట్లు.. అందరికీ వందనములు.