Thursday 20 November 2014

పాలగుమ్మి సాయినాథ్




మనిషికి డబ్బుతో ఏం పని? బ్రతకడానికి డబ్బు అవసరం, సుఖమయ జీవనానికీ డబ్బు చాలా అవసరం. ఆపై ఆ డబ్బు అవసరం ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఆయా వ్యక్తుల ఆలోచనా సరళి బట్టి వుంటుంది. 

మనిషి జీవనానికి అనేక వృత్తులు. అన్ని వృత్తులు ఒకేలా వుండవు. కొన్ని వృత్తులు రెండువైపులా పదునున్న కత్తిలా ప్రత్యేకమైనవి.  

ఇందుకు ఒక ఉదాహరణ - వైద్యవృత్తి. ఈ వృత్తిలో ఎంతగానో సంపాదించే అవకాశం వున్నా.. అసలా ఆలోచనే లేకుండా.. రోగుల సేవ కోసం మాత్రమే పరితపించిన వైద్యులు నాకు తెలుసు. అలాగే, సంపాదనే ధ్యేయంగా రోగుల రక్తం పీల్చి బలిసిన వైద్యులూ నాకు తెలుసు.

ఇంకో ఉదాహణ - పత్రికా రంగం. ఈ రంగంలో - కనీస విలువలు లేనివారి నుండి, ఎంతో నిబద్దత కలిగినవారిదాకా అనేకరకాలైనవారు వుంటారు. పత్రికా విలేకరులు భాధ్యతా రాహిత్యంగా పన్జేస్తారని ఒకప్పుడు అనుకునేవాణ్ని. పతంజలి 'పెంపుడు జంతువులు' నవల చదివాకా - నా అభిప్రాయం మార్చుకున్నాను.

దేవాలయాలు పవిత్రమైనవే - అందులో పన్జేసే ఉద్యోగులు పవిత్రులు కానక్కర్లేదు. ధర్మాసుపత్రులు పేదలసేవ కోసమే - ఆ ఆస్పత్రి వైద్యులు సేవాతత్పరులు కానక్కర్లేదు. పత్రికా రంగం భాధ్యతాయుతమైనదే - ఆ పత్రికల్ని నడిపే యాజమాన్యాలు భాధ్యాతాయుతులు కానక్కర్లేదు.  

కావున - కొన్నివృత్తులు ఒకవైపు నుండి బాధ్యతాయుతమైనవిగానూ.. ఇంకోవైపు నుండి దుర్మార్గమైనవిగానూ నేను భావిస్తున్నాను. అనగా - ఇవి విఠలాచార్య సినిమాలో కత్తి వంటివి. ఆ కత్తిని హీరో ఎన్టీఆర్ సద్వినియోగం చేస్తే, విలన్ రాజనాల దుర్వినియోగం చేస్తాడు.

'ది హిందూ' పత్రిక రూరల్ రిపోర్టర్‌గా పన్జేసిన పాలగుమ్మి సాయినాథ్ తన వృత్తికి వన్నె తెచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆయన రైతు సమస్యల గూర్చి అనేక వ్యాసాలు ప్రచురించాడు. ఆ వ్యాసాలు చదివిన నేను యెన్నో కొత్తవిషయాలు తెలుసుకున్నాను. రైతుల జీవనం గూర్చి ఏమాత్రం అవగాహన లేని నేను - రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో అర్ధం చేసుకున్నానంటే - అందుక్కారణం పి.సాయినాథ్ రచనలే.

పి.సాయినాథ్ తెలుగువాడు, మనిషన్నాక ఏదోక భాషలో పుట్టక తప్పదు. అంచేత ఫలానా వ్యక్తి 'తెలుగు తేజం' అంటూ తెలుగు వార్తాపత్రికల వికారభాష నేను రాయను. ఈ దేశంలో ఆకలికి, దరిద్రానికి మూలాల్ని శోధించే వ్యక్తి - తమిళ తేజమైనా, కొంకిణీ తేజమైనా మనకొచ్చిన ఇబ్బంది లేదు. 

పత్రికా రంగంలో పి.సాయినాథ్ చేసిన కృషి చాలా విలువైనది. ఈనాడు మనక్కనిపించే మనిషి మనిషి కాదు, వార్త వార్త కాదు. వార్తలు వినోద స్థాయికి దిగజారుతున్న సరికొత్త యుగంలో మనమున్నాం. అంచేత (ఇంతకుముందుకన్నా) నిజాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా, నిబద్దతతో రాయగలిగే మరింతమంది సాయినాథ్‌ల అవసరం మనకుంది.  

సాయినాథ్ ఈమధ్య హిందూలోంచి బయటకొచ్చేశాడు. మంచిది! ఇప్పుడింక బంధాలేవీఁ వున్నట్లుగా లేవు - హాయిగా, ప్రశాంతంగా పన్జేసుకోవచ్చు. 

పాలగుమ్మి సాయినాథ్‌కి అభినందనలు.