Monday 17 November 2014

చరిత్ర చెరశాలలో.. పటేల్ - నెహ్రూ


ఇప్పుడు సినిమా కబుర్ల కోసం అనేక మాధ్యమాలు వున్నాయి. నా చిన్నప్పుడు ఇవేవీ లేవు. అయితే మా సినిమా కబుర్లకి మాత్రం తక్కువేమీ లేదు.

'మా ఏయన్నార్ చేసిన దేవదాసు పాత్రని మీ ఎన్టీవోణ్ని చేసి చూపించమను. సినిమా ఒక్కరోజు కూడా ఆడదు.' అని ఒకడు సవాల్ చేస్తే -

'మా ఎన్టీఆర్ చేసిన బందిపోటు మీ నాగ్గాణ్ని చెయ్యమను. జనాలు తెర చించేస్తారు.' అని వేరొకడు వెక్కిరించేవాడు.

సరదాగా మొదలైన కబుర్లు ఒక్కోసారి తన్నులాటకిక్కూడా దారి తీసేవి. ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యర్ధులైనా.. ఇద్దరూ సినిమా నటులే. ఆ విషయం తెలీంది మాకే!

ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఈ.వి.రామస్వామి (పెరియార్) రాసిన రామాయణం కొంత చదివాను. 'కొంత' అని ఎందుకంటున్నానంటే మొత్తం చదవడం నావల్ల కాలేదు కాబట్టి. పెరియార్ నాస్తికుడు. ఆనాటి సమాజంలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సాంస్కృతిక నాయకుడు. ఆయన ఉద్యమానికి ఏం చెప్పాలి? 'ఆధిపత్య శక్తులు తమ పెత్తనం సాగించుకోడం కోసం సృష్టించబడ్డ ఒక హిందూ మైథాలజి రామాయణం. దాన్ని చదవకండి, చెత్తబుట్టలో పడెయ్యండి!' అని చెప్పాలి. కానీ ఆయనలా చెప్పలేదు.

మనం ఏవైతే రాముడి లక్షణాలు అనుకుంటామో, అవి తీసుకెళ్ళి రావణుడికి ఆపాదించాడు. సీత లక్షణాలు శూర్పణక, మండోదరిలకి ఆపాదించాడు. అంటే పాజిటివ్ నెగెటివ్‌గానూ, నెగెటివ్ పాజిటివ్‌గానూ రాశాడు. ఆయాన్రాసింది చదువుతుంటే - విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ రాజనాలతోనూ, రాజశ్రీ విజయలలితతోనూ పాత్రలు మార్చుకున్నట్లుగా అనిపించి నవ్వొచ్చింది. కాకపొతే పెరియార్‌కి రామాయణం పట్ల తీవ్రమైన కోపం వుందని మాత్రం అర్ధమవుతుంది. 

ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమానులు తిట్టుకున్నట్లుగానే - ఇప్పుడు నెహ్రూ, పటేల్ అభిమానులు గ్రూపులుగా విడిపొయ్యి వాదించుకుంటున్నారు. ఆనాడు పెరియార్ ఆపాదించినట్లుగా - పటేల్ అభిమానులు నెహ్రూని విలన్‌గా చూపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ అభిమానులకి రాజకీయ కారణాలు తప్ప మరే కారణం లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇప్పుడు బీజేపి అధికారంలోకి వచ్చింది కాబట్టి పటేల్ కూడా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఐతే - హిందుత్వ శక్తులకి పటేల్ మీద అంత ప్రేమెందుకు? పటేల్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్.. అందరూ నెహ్రూ నాయకత్వంలోనే పన్జేశారు కదా? అందరూ కాంగ్రెస్ నాయకులేగా! అయితే అందరూ మంచివాళ్ళవాలి లేదా చెడ్డవాళ్ళవాలి. కానీ - వారికి నెహ్రూ ఒక్కడే చెడ్డవాడు ఎలా అవుతాడు?

భారద్దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది (అంతకుమించి మనకి వేరే గతి లేదు). ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుల్లో.. ఇప్పటి పార్టీల్లోలానే - అనేక లుకలుకలున్నాయి, కుమ్ములాటలున్నాయి, ఎత్తుకు పైయ్యెత్తులున్నాయి. పన్లో పనిగా మన జాతిపితగారు కూడా తన వంతు పాత్రని పోషించారు - నెహ్రూని ప్రధానిగా చేశారు. ఇట్లాంటివన్నీ ఒక రాజకీయ పార్టీలో సహజమే. కాకపోతే చిన్నప్పుడు పాఠాల్లో వీళ్ళ గూర్చి గొప్పగా చదువుకున్నాం కాబట్టి - వీళ్ళంతా దేవతలన్నట్లుగా ఫిక్సైపొయ్యాం.

ఒక ప్రభుత్వం - దేశానికి మంచి చేసినా, చెడు చేసినా మంత్రివర్గం సమిష్టి బాధ్యత వుంటుంది. పటేల్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా నెహ్రూ ఆలోచన వుండాలి, అలాగే నెహ్రూ తప్పుల్లో పటేల్‌కీ వాటా వుంటుంది. ఒక వ్యక్తికి - ఒక పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా ఒక నిర్ణయం నచ్చనప్పుడు వ్యతిరేకించాలి, వ్యతిరేకించినా కుదరనప్పుడు బయటకి వచ్చెయ్యాలి. ఏ దేశంలోనైనా ఇదే డెమాక్రటిక్ ప్రిన్సిపుల్‌ అప్లై అవుతుంది. మంచంతా ఫలానా ఆయన గొప్పదనం, చెడంతా ఇంకోకాయన నిర్వాకం అని బుకాయిస్తే.. నమ్మేవాళ్ళు నమ్మవచ్చు గాక - నైతికంగా సరికాదు (పటేల్ చివరిదాకా కాంగ్రెస్‌లోనే వున్నాడని మర్చిపోరాదు).

ఒకప్పుడు పెరియార్‌ రాసినట్లుగా - ఇవ్వాళ సుగుణాలన్నీ పటేల్‌కే వున్నట్లు హిందూత్వ శక్తులు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నాస్తికుడైన పెరియార్‌కి రావణుడు హీరో అయినట్లుగా, చివరిదాకా కాంగ్రెస్‌వాదిగా మిగిలిన పటేల్ బీజేపీకి హీరో అయ్యాడు! తమ అన్న ధర్మరాజు జూదం ఆడ్డం ఇష్టం లేకపోయినా - నలుగురు తమ్ముళ్ళు నోర్మూసుకుని కూర్చున్నారంటే - వారిక్కూడా ఆ జూదంలో భాగం వుంటుంది. అందుకే ఇవ్వాళ ప్రజలకి మన్‌మోహన్‌సింగంటే అంతే కోపం. పటేల్, నెహ్రూ, అంబేడ్కర్‌లని వేరు చేసి చూపడం అంటే - ఒకే తానులో ముక్కల్ని విడివిడిగా అంచనా వెయ్యబూనడమే.

పాపం! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీవాళ్ళది విచిత్ర సంకటం. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కూడా తమ నాయకులే. ఇన్నాళ్ళూ ఉద్దేశ్యపూర్వకంగా పటేల్‌ని పక్కన పెట్టారు. కానీ - నెహ్రూవియన్ విజన్‌ని అవసరానికి మించి పొగుడ్తుంటారు. అందుకు వారికున్న రాజకీయ ప్రయోజనాలే కారణం. వాళ్ళకి నెహ్రూ లెగసీ పూర్తిగా తమ సొత్తేనని, తామే నెహ్రూ వారసులమనీ ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకి వున్న కోపం నెహ్రూ మీదక్కూడా వెళ్తుంది!

ఈ విధంగా - ప్రస్తుతం హిందుత్వ వాదులు పటేల్నీ, కాంగ్రెస్ వాదులు నెహ్రూని చెరొక పక్కా దొరకబుచ్చుకుని (ఆ నాయకులిద్దరూ ఎంత గింజుకున్నా) వదలట్లేదు. ఆ నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేప్పుడు, వచ్చిన తరవాత - రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వుండి, దేశగతినే మార్చేసిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంతనేది తెలుసుకోవాలనుకోడం ఎలా వుంటుందంటే - 'వంకాయ కూరకి ఉప్పు ముఖ్యమా? కారం ముఖ్యమా?' లాగా!

సంఘ పరివారానికి స్వాతంత్రోద్యమంలో పెద్దగా పాత్ర లేదు, వున్నదంతా కాంగ్రెస్‌దే (అదెంత దరిద్రపు దయినప్పటికీ). ప్రస్తుతం ఆ కాంగ్రెస్ అవినీతి రొచ్చులో పీకల్దాకా కూరుకుపోయింది (ఇప్పుడల్లా బయటకొచ్చే అవకాశాలు కనపడట్లేదు). చరిత్ర లేని సంఘ పరివార్ సమస్య - ఐడెంటిటీ క్రైసిస్. అందుకే తెలివిగా పటేల్‌ని తమ పార్టీలో కలిపేసుకున్నారు. ఇదోరకంగా - మన తెలుగు సినిమా సమస్య. వంశచరిత్ర వున్నవాడికేమో నటన రాదు, నటన తెలిసినవాడికేమో వంశచరిత్ర లేదు!

ఈ దేశగతి మార్చిన - ఏ రాజకీయ ఆలోచననైనా చర్చకి, శల్యపరీక్షకి గురి చెయ్యాల్సిందే. అయితే - అది జరగాల్సింది చరిత్రకారుల శాస్త్రీయ విశ్లేషణల ద్వారా మాత్రమే తప్ప పార్టీ ఆఫీసుల్లో కాదు. ఎందుకంటే నెహ్రూ, పటేల్ వంటి నాయకులు చాలా భిన్నమైన ఆలోచన ధోరణి కలిగినవారు. ఎక్కడైనా, ఎప్పుడైనా - రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు అనేక పరిమితులకి లోనై వుంటాయి. వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచి ఫలితాల్నిస్తే, మరికొన్ని బెడిసికొడతాయి. కానీ - అప్పటి నాయకుల్లో వున్నదీ, ఇప్పటి నాయకుల్లో లేనిదీ ఒకటి వుంది - నిజాయితీ!

ముగింపు -

జైళ్ళు బ్రతికున్నవాళ్ళ కోసం వుపయోగిస్తారు. కానీ - పాపం! పటేల్, నెహ్రూలు చనిపోయినా కూడా రెండు రాజకీయ పార్టీలవారి బందిఖానాలో యిరుక్కుపొయ్యారు. వారి స్థితి జీవిత ఖైదీల కన్నా ఘోరం! వారికి చెరసాల నుండి త్వరలో విముక్తి కలగాలని ఆశిస్తున్నాను!