Friday 14 November 2014

సిగ్గుతో తల దించుకుందామా?


ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు చనిపొయ్యారు. ఈ చావులు ఆ కుటుంబాలకి తీరని నష్టం. ఈ సంఘటన దేశపౌరులుగా మనమందరం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. 

ఈ చావులకి కారణం తెలుసుకోడానికి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఆ కమిటీ ఏదో రిపోర్టునిస్తుంది. ఆ రిపోర్టుపై ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకున్నామని కూడా చెబుతుంది. ఇదంతా ఓ తమాషా మాత్రమేనని అర్ధం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. 

అవడానికి మనది ఒకటే దేశమైనా - ఒకదేశంలోనే అనేక దేశాలున్నాయి. ఒకదేశంలో ప్రపంచస్థాయి వైద్యం జరిగితే, ఇంకోదేశంలో కుక్కల కన్నా హీనమైన వైద్యం జరుగుతుంది. ఒకదేశంలో చిటికెన వేలు దెబ్బకి పదిమంది వైద్యుల బృందం వైద్యం ఆపరేషన్ చేస్తే, ఇంకోదేశంలో సరైన ప్రసూతి సౌకర్యాలు లేక చనిపోతారు.

ఈ దేశంలో పేదలకి రక్షణ లేదు. పేదల పట్ల ధర్మకర్తలుగా వుండాల్సిన ప్రభుత్వాలు.. తమ కర్తవ్యాన్ని వదిలేసి అగ్రరాజ్యాలకీ, అంతర్జాతీయ వ్యాపారస్తులకీ మోకరిల్లుతున్నారు. అదేమంటే - ఏవో అర్ధం కాని లెక్కల్తో ఆర్ధిక పాఠాలు చెబుతారు. 

ఏ దేశంలోనైనా పేదవాడి బ్రతుకు హీనమే. దరిద్రులంటే దోమలకి లోకువ, రోగాలకి లోకువ, బొచ్చుకుక్కలకి లోకువ. ఇంతమందికి లోకువైన ఈ ప్రత్యేకజాతి ఐదేళ్ళకోసారి ఓట్లేయించుకోటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదని ప్రభుత్వం వారిక్కూడా లోకువే. 

అందుకే - పేదవాళ్ళు ఆకలికి అలమటించి చస్తారు, చలికి నీలుక్కుపొయ్యి చస్తారు, ఎండకి ఎండిపొయ్యి చస్తారు, వరదలకి కొట్టుకుపొయ్యి చస్తారు. ఇన్నిరకాలుగా చచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని కూడా చస్తున్నారు. ఇకనుండి వాళ్ళు చచ్చేందుకు మరో కొత్తకారణం!

విచారణలో అనేక విషయాలు ప్రస్తావనకి రావొచ్చు. సరైన ప్రీ ఆప్ చెకప్స్ జరగలేదనీ, లేపరోస్కోపీ పరికరాన్ని సరీగ్గా స్టెరిలైజ్ చెయ్యలేదనీ, గేస్ కలుషితమైందనీ, డాక్టర్ నిర్లక్ష్యమనీ, పోస్ట్ ఆప్ కేర్ సరీగ్గా ఇవ్వలేదనీ, మందులు మంచివి కావనీ.. ఇలా. సరే! ఈ లోపాల్నన్నింటినీ సరిచేసుకుని - భవిష్యత్తులో పొరపాటున కూడా మళ్ళీ ఇలా జరక్కుండా చేసుకునే కట్టుదిట్టమైన వ్యవస్థ మనకుందా? లేదని నేననుకుంటున్నాను.  

వీధికుక్కల సంఖ్య పెరక్కుండా వాటికి స్టెరిలైజ్ చెయ్యాలని కొన్ని స్వచ్చంద సంస్థలు చెబుతుంటాయి. ఈ గోలంతా లేకుండా - చాలా మునిసిపాలిటీల్లో వీధికుక్కల్ని ఊరి బయటకి పట్టుకెళ్ళి మూకుమ్మడిగా చంపేస్తారు. ఒకవేళ ప్రభుత్వాలకి కూడా జనాభా నియంత్రణకి కుక్కల మోడెల్లో ఏదైనా హిడెన్ ఎజెండా వుందేమో తెలీదు. వున్నా అవి మనకి చెప్పవు.

ఎందుకంటే - బహుళజాతి మందుల కంపెనీలు పేదవారిపై తమ మందుల్ని ప్రయోగించి పరిశీలించుకునే సౌలభ్యాన్ని కల్పించిన దేశం మనది. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఇలా జరుగుతుందని బయటపడ్డప్పుడు మాత్రం ఎంతోకొంత నష్టపరిహారం ప్రకటించి, ఒక విచారణ కమిటీ వేసి చేతులు దులుపుకోవడం మన ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య. 

చివరిగా -

లేపరోస్కోపిక్ ట్యూబెక్టమీ చేయించుని హీనంగా, దారుణంగా చనిపోయిన మహిళలకి - సిగ్గుతో తల దించుకుని - నివాళులర్పిస్తున్నాను.