Monday 10 November 2014

కారా మాస్టారి పుట్టిన్రోజు హడావుడి, ఆర్భాటం!


ప్రపంచంలో ప్రతి జీవికీ చావుపుట్టుకలుంటాయి. పుట్టిన ప్రతి జీవి చావక మానదు. ఆ మాటకొస్తే బల్లలు, కుర్చీల్లాంటి వస్తువులక్కూడా చావుపుట్టుకలుంటాయి. తాత్వికంగా చూస్తే - ఈ పుట్టిన్రోజు, చచ్చిన్రోజులకి పెద్ద ప్రాముఖ్యత వుండదు, వుండరాదు.

బాగా డబ్బున్నవారికీ, పేరుప్రఖ్యాతులు సంపాదించినవరికీ ఈ పుట్టిన, చచ్చిన రోజులు పవిత్రమైన పుణ్యదినాలు. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ కాడర్ కోసం ఈ సందర్భాల్ని వాడుకుంటారు. ఇంక సినిమా హీరోల పిచ్చి అభిమానులు చేసే హడావుడి యింతంత కాదు.. పరమ రోతగా వుంటుంది.

ఈ మధ్య ఈ పుట్టిన్రోజుల హడావుడి తెలుగు సాహిత్యంలోకి కూడా వచ్చి చేరింది. గురజాడ, శ్రీశ్రీ మొదలైన ఆధునిక రచయితలు పుట్టిన వందో సంవత్సరాన్ని ఓ పండగలా చేశారు. ఎవరి ఉత్సాహం వారిది. వారి ఆనందాన్ని కాదన్డానికి మనమెవరం?

మా ఊళ్ళో క్వారీ యజమానులు, పొగాకు వ్యాపారస్తుల దగ్గర్నుండి చందాలు వసూలు చేసి సాహిత్య సభలు పెడ్తుంటారు! ఈ చందా వసూళ్ళు కార్యక్రమం అచ్చు ఒకప్పుడు శ్రీరామనవమి చందా వసూళ్ళ లాగా, ఇప్పుటి గణేష్ చతుర్ధి చందా వసూళ్ళలా సాగుతుంది. ఆ చందాలతో అభ్యుదయ కవుల పుట్టిన్రోజు పండగలు జరుపుతారు!

పై ఫోటోలో కిరీటం పెట్టించుకుని శాలువాలు కప్పించుకుంటున్న వ్యక్తి సామాన్యుడు కాదు. తెలుగులో ఎన్నో గొప్ప కథలు రాసిన కాళీపట్నం రామారావు (కారా మాస్టారు). నిన్న కారా మాస్టారి పుట్టిన్రోజు. ఆ పుట్టిన్రోజు జరపబడ్డ వార్త చదువుతుంటే చికాగ్గా అనిపించింది. ఏ రాజకీయ నాయకుడి, సినిమా హీరో పుట్టిన్రోజుకీ తక్కువ కాకుండా రంగరంగ వైభవంగా జరిపారు. ఈ హడావుడి మాస్టారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. మరప్పుడు ఆయన ఇట్లాంటి ఆర్భాటాలకి ఎందుకు ఒప్పుకున్నాడు?

నా అభ్యంతరం కారా మాస్టారి అభిమానులకి కోపం తెప్పించొచ్చు. కానీ - నేనూ ఆయన అభిమానినే! అందుకే నాకు చిరాగ్గా వుంది. ఇదే ఏ పాపులర్ రచయిత పుట్టిన్రోజైతే అస్సలు పట్టించుకోం. వాళ్ళు గజారోహణ చేసినా మనకి సంబంధం లేని అంశం. కానీ - అఫాల్ ద పీపుల్ - కారా మాస్టారా!

ఆయన శిష్యకోటి తమ అభిమానం వ్యక్తం చేసేందుకు ఇలాంటి చౌకబారు ప్రదర్సన ఏర్పాటు చేసుండొచ్చు. ఆయన సహజంగానే మొహమాటస్తుడు కాబట్టి - కాదనలేకపోవచ్చు. కానీ - ఈ మొహమాటం ఆయన కథల్లో వుండదు కదా! నాకిప్పుడు అనిపిస్తుంది. రచయితగా కారా వేరు, వ్యక్తిగా కారా వేరు. ఈ వైరుధ్యంతోనే మనం ఆయన్ని అర్ధం చేసుకోగలగాలి - అదెంత కష్టసాధ్యమైనా!

కారా మాస్టారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, హాయిగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను.