Thursday, 11 September 2014

రాజకీయ భాష


"మావాఁ! రాష్ట్రంలో రాజకీయం అట్టుడిగిపోతుంది. నువ్వేమో ఇక్కడ తాపీగా చుట్ట కాల్చుకుంటున్నావు!"

ప్ప్.. ప్ప్.. ప్ప్.. (చుట్ట పీకుడు శబ్దం).

"అవున్లే! రాష్ట్రం ఎట్లా పోతే నీకెందుకు? నువ్వు మాత్రం చుట్ట కాల్చడం ఆపకు మావాఁ!"

"ఎహెఁ! కమ్మగా సుట్ట కాల్చుకుంటావుంటే మద్దిన నీ గోలేంది?" చుట్టకొన కొరికి తుపుక్కున ఊశాడు మామ.

మా మామ తనేంటో, తన పనేంటో అన్నట్లుగా వుంటాడు. చుట్ట కాల్చడం ఆయనకెంతో ఇష్టం, ఆయనతో కబుర్లాడ్డం నాకిష్టం. మామ చదువుకోలేదు కానీ - లోకజ్ఞానం ఎక్కువ.

"మావాఁ! మన రాజధాని విజయవాడ. పేపర్లో రాశారు."

"వురే అల్లుడూ! నువ్వు సదువుకున్నోడివి. ఇట్టా అంటన్నానని ఏవీఁ అనుకోమాక. నీకీ మాత్రం ఇసయం పేపర్లో రాస్తే గానీ తెలవదా?"

"నాకు నీ అంత తెలివి లేదులే మావాఁ!"

"అట్టా ఉడుక్కోమాకల్లుడూ! ఎన్నికల్లో గెలిసింది ఏ పార్టీ? సౌదర్ల పార్టీ. ఆళ్ళదే వూరు? బెజవాడ. రాజదాని ఆళ్ళ వూళ్ళో ఎట్టుకుంటారు గానీ, పరాయూళ్ళో ఎట్టుకోరుగా?"

"మావాఁ! అక్కడే నువ్వు పప్పులో కాలేశావ్! ఈ నిర్ణయానికి కారణం కులం కాదు. విజయవాడ రాష్ట్రం మధ్యలో వుంది. అక్కడ కృష్ణానది వుంది.. "

"అల్లుడూ! దేసంల తెలుగు బాస, అరవ బాస అని రకరకాల బాసలున్డాయి. అట్టాగే రాజకీయ బాస అని ఒకటుంటది. అది రాజకీయాలు నాయకులు మాట్టాడే బాస. ఆళ్లా బాసలోనే మాట్టాడతారు, మాట్టాడాల."

"రాజకీయ భాష?"

"అల్లుడూ! ఈడ పెజల్ని ఉద్దరించడాని ఎవుడూ లేడు. ఎవుడన్నా ఎర్రి సన్నాసి ఆ బెమలో వుంటే ఆడికో దండం! రాజకీయాల్లో ఎవుడుకేది లాభవోఁ అదే చేసుకుంటాడు. ఆ ఇసయం బైటికి సెప్తే ఆడికి దెబ్బ. అందుకని జెనాలకి సెప్పడానికి మాత్రం 'ఓ నా పెజలారా!' అంటా రాజకీయ బాసలో మాట్టాడతాడు."

ప్ప్.. ప్ప్.. ప్ప్.. (మళ్ళీ చుట్ట పీకుడు శబ్దం). నేనేం మాట్లాడలేదు.

కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ చెప్పసాగాడు మామ.

"గెలిసింది సౌదర్ల పార్టీ కాబట్టి బెజవాడ అన్నారు. అదే రెడ్ల పార్టీ గెలిసిందనుకో! ఆళ్ళూ రాజకీయ బాసలోనే సెప్తారు. ఏ భూకంపవోఁ వొచ్చి బెజవాడ కిస్టానదిలో మునిగిపోద్ది అంటారు, పెద్దమడుసుల ఒప్పందం అంటారు, సీవఁ ఎనకబడింది అంటారు. చివరాకరికి రాజదాని ఏ కర్నూలో, కడపో అంటారు."

"అవును కదా!"

"ఆ ఇసయాలన్నీ నీలాంటోడు పేపర్లో సదూకుని తెలుసుకుంటాడు. నాలాంటోడు సుట్ట కాల్చుకుంటూ ఆలోసిస్తాడు."

"మావాఁ! రాజకీయాలు ఘోరంగా వున్నాయి."

"ఇందులో గోరవేఁవుంది! ఎవుడి కులానికి ఆడు సేసుకోకపోతే పక్కోడొచ్చి సేస్తాడా?"

ప్ప్.. ప్ప్.. ప్ప్.. (మళ్ళీ చుట్ట పీకుడు శబ్దం).

ఒక క్షణం ఆలోచించి చెప్పసాగాడు మామ.

"చినీమాలో మనక్కనిపించేది ఎన్టీవోడి బొమ్మే. కానీ తెరెనకమాల ఎంత అడావుడుంటది! ఎన్నికల్లో బైటిక్కనిపించేది పెదాన నాయకులే! లోన చానా మతలబుంటది. రాజదాని ఏర్పాటు పెబుత్వాలకి చాలా గిట్టుబాటు యవ్వారం. అందుకే సౌదర్లంతా ఒక తట్టు, రెడ్లంతా ఒక తట్టు గండుపిల్లుల్లాగా కొట్టుకున్నారు."

"మరప్పుడు వాళ్లకి బలహీన కులాలవారు ఓట్లెందుకేస్తారు?"

"యేస్తారు. యెయ్యక సస్తారా? ఆళ్ళు సేసే పని అదొక్కటే! అందుకే వోరసగా నించుని ఓటింగు మిసనీని కుయ్యిమని నొక్కుతారు."

"అదే! ఎందుకు? వాళ్ళకి రాజకీయం తెలీదా?"

ప్ప్.. ప్ప్.. ప్ప్.. (మళ్ళీ చుట్ట పీకుడు శబ్దం). కొద్దిసేపు మౌనం.

"ఎందుకు తెలీదు? బాగా తెలుసు. కానీ - ఇద్దరు పెద్దోళ్ళు కత్తులు దూసుకుంటావుంటే మద్దిన సత్తరకాయగాడు దూరితే ఏవఁవుద్ది? ఆళ్ళు 'ఓల్డాన్' అనుకుంటూ కుసింతసేపు కత్తులు పక్కన పడనూకి  'వురేయ్ సత్తరకాయ్! మేవూఁ మేవూఁ తగువాడుకుంటన్నావఁంటే అదో అందం సందం. ఎన్టీవోడి చినీమాలో రేలంగోళ్ళా మద్దిన నీ కేమిడీ ఏందిరా బాబు?' అని వోర్నింగిస్తారు. ఇనుకోకపోతే 'ఎహె నీయమ్మ! పోరా నా కొడకా!' అని మాడు పగల దొబ్బుతారు. పాపం సిరంజీవిని సూడు! సినిమాల్లో ఎసుంటోడు? ఇప్పుడు సీకేసిన తాట్టెంక మాదిరిగా అయిపోలే!"

"మావాఁ! నిన్ను చూస్తుంటే ఈర్ష్యగా వుంది!"

"ఎందుకల్లుడూ?"

"చుట్ట పీలుస్తూనే రాజకీయాల్ని కూడా పీల్చిపిప్పి చేశావ్!"

"ఏదో నీ అబిమానం అల్లుడూ!"

ప్ప్.. ప్ప్.. ప్ప్.. (మళ్ళీ చుట్ట పీకుడు శబ్ధం).