Saturday, 6 September 2014

బంగారిగాడి తప్పు


దేశ భాషలందు తెలుగు లెస్స! అన్నపానముల కన్నా సురాపానము మిన్న! కొట్లయందు సారా కొట్లు వేరయా!

ఓయీ వైద్యాధమా! ఏమి ఈ వెర్రి వ్రాతలు? 

ఓ సారీ! విషయంలోకి ఎలా దిగాలో తెలీక మాటల కోసం వెతుక్కుంటూ తచ్చాడుతున్నా, ఇంక చదవండి.

తెలుగు దేశంలో లెక్కకి మించి మిక్కిలిగా యున్న అనేకానేక సారా కొట్ల యందు అది యొక కొట్టు. అదిగదిగో - ఆ మూలన ఓ పోలీసాయన కనబడుతున్నాడా? ఆయనే సూర్రావెడ్డు. సూర్రావెడ్డెదురుగా కూర్చుని సురాపానము సేవించు ఆ కుర్రాడు బంగారిగాడు. చూడ్డానికి కత్తిలా వుంటాడు. అయితే ఆ కత్తి హత్యలకి పనికొచ్చేదే గానీ - కూరగాయలు కోసుకోడానికి పనికొచ్చేది కాదని మీరు తెలుసుకొనవలెను.

పరిచయం అయిందిగా! ఇక వారి ముచ్చట్లు వినెదము రండి!

"అన్నేయం! రావులోరు సీతమ్మని అడవులకంపీడం అన్నేయం!" అన్నాడు బంగారిగాడు.

"తప్పురా బంగారిగా! రావులోర్ని ఏటీ అనబాకు! ఆ బాబెవురు? ఇష్నుమూర్తి అవతారం. ఇష్నుమూర్తిని ఫేమిలీ మేటరు కొచ్చినింగ్ చేసి ఎఫ్ఫైయ్యార్ రాస్తే ఏటవుద్ది? డవిరక్టుగా నరకవేఁ! మందెక్కువైతే సిలక పిట్టన్దీసుకుని లాడిజింగుకి పో! నువ్వు మడిసివి - పాపం జెయ్యి, తప్పు లేదు! కానీ గుడి కెల్లి వుండీలో నాల్రూకలేసి 'సావీఁ! తప్పయిపొనాది' అని ఆయనకో దండం పడేసి లెంపలేసుకో! పాపవఁంతా పినాయిల్తో కడిగినట్టు పోద్ది. రాజకీయ నాకొడుకులంతా చేసేదిదే! తెల్సుకోరా తాగుబోతెదవ!" ముద్దుగా అన్నాడు సూర్రావెడ్డు.

"సర్లే గురూ! పెదానమంత్రి ఇస్కూలు పిల్లల కోసం ఏదో ప్రోగ్రామింగు చేశాడంట! అదేంది గురూ! పెదానమంత్రి రాజ్జెం ఏలాలి గానీ.. ఇస్కూలు పిల్లలకి సుద్దులేంది!" అన్నాడు బంగారిగాడు.

"అమ్మనీయమ్మ! ఇయ్యాల నీ ఆలోసెన సేనా దూరం పోతందిరా! అసల్నీకు పెదానమంత్రి అంటే ఎవురో తెలుసురా బంగారిగా? పోలీస్ టేసెన్ ఎవర్రాజ్జెం? యెస్సై రాజ్జెం. మరి దేసం ఎవర్రాజ్జెం? పెదానమంత్రి రాజ్జెం. టేసన్లో ఎస్సై నాగా దేసానికి పెదానమంత్రన్నమాట! పెదానమంత్రి ఇస్కూలు పిల్లల్తో మాటలే ఆడతాడో, పాటలే పాడ్తాడో నీకెందుకురా? ఏన్దిరోయ్ బంగారిగా! పిక్‌పాకిటింగు సేస్తానే సానా ఇసియాలు ఆలోసిస్తన్నావే!" నవ్వుతూ అన్నాడు సూర్రావెడ్డు.

"అంతా నీ అబిమానం గురూ! సెంద్రబాబు ఇజీవోడని రాజదాని సేసాడంట! ఇన్నావా?" అడిగాడు బంగారిగాడు.

"ఒరే! సెంద్రబాబంటే ఎవళ్ళు? మన ఎస్పీ దొరగారికంటే మోస్ట్ పవర్‌ఫుల్లు మడిసి. ఆ బాబు తల్సుకుంటే ఇజీవోడని రాజదానీ సేస్తాడు, తల్సుకోకపోతే నీలాంటి బేవార్సుగాడికి దానంగా ఇచ్చేసి 'ఒరే బంగార్నాకొడకా! ఆ దుర్గమ్మ కొండ నీది, ఈ కిస్టానది నీది, అల్లదిగో - ఆ బెంజి సరికిలూ నీదే. యాడ పడితే ఆడ పిక్‌పాకెటింగు సేస్కోరా! కేసుల్లేవ్! సిచ్చల్లేవ్!' అంటాడు. రాజదానిసయం సెంద్రబాబిట్టం. అయినా - ఈ ఇసయాలు నీకెందుకు?" విసుక్కున్నాడు సూర్రావెడ్డు.

"అంతేనంటావా?" అన్నాడు బంగారిగాడు.

"ఇంక నానేవన్ను. నాకు నరసమ్మ కంపినీలో బేగి పనున్నాది. సింహాచెలం గోడు కొత్త పిట్టని అట్టుకొచ్చాడు. పేరు రత్తాలంట, సూడ సక్కని గుంటంట! ఆడా సరుకుని మన నరసమ్మకి అమ్మీసేడు. ఆ రత్తాల్లంజకి టెక్కెక్కువైపోనాదంట! యాపారానికి ఒప్పట్లేదు. అంత సొమ్మెట్టి కొన్న సరుకు వురదాగా వుంటే పానం సివుక్కుమందా? బిగినిస్‌కి ఎంతెబ్బ! పాపం నరసమ్మ! ఓ పాలి అటెల్లి ఆ రత్తాల్లంజ రోగం కుదర్చాలా!" మత్తుగా అన్నాడు సూర్రావెడ్డు.

"ఎల్తా ఎల్తా బిల్లు కట్టి పో గురూ!" చిన్నగా అన్నాడు బంగారిగాడు.

"హమ్మ దొంగలంజికొడకా! ఎంత మాటనీసేవురా బంగార్లంజకొడకా! పులి నక్కతో స్నేయితం సేస్తది. ఎందుకు? అడవిలో ఆసుపాసులు కనుక్కుందుకు. పులి సనువిచ్చింది కదాని నక్క ఎకసెక్కాలాడితే దానికి ఉరిసిచ్చే గతి - గుర్తుంచుకో! నన్నే బిల్లు కట్టమంటావా? నా సర్వీసులో నన్నీ మాటన్న మొగోడే లేడు. మాట తేడా వొస్తే నాను ఎస్పీదొరగోడైనా, ఆడెమ్మ మొగుడైనా - డోంట్‌కేర్! తప్పు జేసావురా బంగారిగా! నీకు కళ్ళు నెత్తికెక్కాయిరా లంజికొడకా!" ఇంతెత్తున ఎగిరాడు సూర్రావెడ్డు.

"తప్పైపోయింది గురో! చమించు." దీనగా మొహం పెట్టి కామిడీగా అన్నాడు బంగారిగాడు.

 కళ్ళెర్రజేశాడు సూర్రావెడ్డు.

"ఒరే బంగార్లింజికొడకా! ఇది ఇందూదేసం! ఈ దేసంలోనే కాదు, ఏ దేసంల అయినాసరె పోలీసోడంటే గొప్ప డేంజిరస్ మనిసని తెలుసుకో! ఈ రాజ్జెంల సేంతిబద్రతలు నా పేనం. పులికి మీసాల్లాగినట్లు పోలోసోడితో దొంగసరసం సెయ్యమాకు. డెకాయిటీ కేసులో ఇరికిచ్చీసేనంటే సచ్చేదాకా సిప్పకూడే! టేక్కేర్!" అంటూ విసవిసా వెళ్ళిపొయ్యాడు సూర్రావెడ్డు.


చివరిమాట -

రాచకొండ విశ్వనాథశాస్త్రి 'మూడుకథల బంగారం' చదివినవారికి సూర్రావెడ్డు, బంగారిగాడు బాగా పరిచయం.

రత్తాలు, సింహాచలం, నరసమ్మల ప్రస్తావన తెచ్చాను. వీళ్ళు 'రత్తాలు - రాంబాబు' పాత్రలు.


ఇంకో చివరిమాట -

ఇష్టమైన పాత్రలతో కరెంట్ టాపిక్స్ మాట్లాడించడం నాకో సరదా. నాకు ఉత్తరాంధ్ర భాష తెలీదు, రావిశాస్త్రి రచనల ద్వారా మాత్రమే పరిచయం. కావున నా భాష పరిమితుల్ని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.