Monday 29 September 2014

రాజ్‌దీప్ సర్దేశాయ్


నిన్న రాజ్‌దీప్ సర్దేశాయ్‌ని అమెరికాలో లాగారు, పీకారు (తన్నారో లేదో తెలీదు). రాజ్‌దీప్ సర్దేశాయ్ మీద మోడీకి, మోడీ భక్తులకి వున్న కోపం ఈనాటిది కాదు. కాబట్టి అతనిపై మోడీ భక్తుల దాడి పెద్దగా అశ్చర్యం కలిగించ లేదు. అయితే ఈ ఘటన అమెరికాలో జరగడమే విశేషం!

మనం భారతీయులం. ఇందుకు మనమెంతో గర్విస్తుంటాం. మన అభిప్రాయాల్ని కాదన్నవారిని తిడతాం, కుదిర్తే తంతాం. ఈ సహజ గుణం తెలుగువాడిలో మరీ ఎక్కువ. మనం ఇంత ఆవేశంగా ఎందుకుంటాం? మనం తినే ఆహారం తాలూకా ఘాటు మన ఆలోచనల్నీ, ప్రవర్తననీ కూడా ప్రభావితం చేస్తుందా? మా గుంటూరు మిర్చికి ప్రసిద్ధి. అందుకే కాబోలు - మాకు పౌరుషం, రోషం కూడా ఎక్కువే. 

ఉదాహరణకి - అడ్డదిడ్డంగా వుండే ట్రాఫిక్‌లో వాహనాలు స్వల్పంగా రాసుకున్నా - వాహనాలు రోడ్డుకి అడ్డంగా నిలిపేసి గంటసేపు తిట్టుకుంటాం. మీసాలు మెలేస్తాం, తొడగొట్టి సవాళ్ళు విసురుకుంటాం. మా ఊళ్ళో పనీపాటా లేనివాళ్ళు కూడా ఎక్కువే! అందుకే - వందలమంది గుమికూడి జరగబొయ్యే తన్నులాట కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాం. ఇలా చూడ్డం - మాకు గ్లాడియేటర్ సినిమాలో రస్సెల్ క్రో కత్తి యుద్ధం చూసినంత వినోదంగా వుంటుంది. 

మా గుంటూరు వాసులు చాలామంది అమెరికా పొయ్యి స్థిరపడ్డారు. బాగా సంపాదించుకుని సుఖంగా జీవిస్తున్నారు. చాలా సంతోషం. అయితే నాకు నచ్చని అంశం - వారిలో సహజసిద్ధంగా వుండాల్సిన 'గుంటూరు ఫైర్' తగ్గిపోవడం. సింహం అడవిలో ఎక్కడున్నా ప్రళయ భీభత్సంగా గాండ్రించి మిగిలిన జంతువుల్ని భయపెట్టాలి కదా! కానీ - మా గుంటూరు అడవి సింహాలు అమెరికా వెళ్లి సర్కస్ సింహాల్లా అయిపోవడం నన్ను మిక్కిలి బాధించేది. 

అయితే - మన సింహాలు ఇన్నాళ్ళూ అవకాశం లేకనే గాండ్రించ లేదనీ, కొద్దిగా అవకాశం దొరికినా అసలు రంగు బయటకొస్తుందని నిన్ననే తెలుసుకున్నాను. అమెరికాలో రాజ్‌దీప్ సర్దేశాయ్ మీద జరిగిన దాడి చూశాకా - నాకు చాలా సంతోషంగా అనిపించింది. బయటకి సూటూ బూటూ వేసుకున్నా - మన భారతీయులు తమ భారతీయతని కోల్పోలేదు. ఇది చాలా అనందదాయకం. ఇందుకు నాకు చాలా గర్వంగా వుంది.