Tuesday 2 September 2014

సమాజం - నేరం


ఇవ్వాళ దక్కన్ క్రానికల్ ఐదో పేజిలో ఒక వార్త. రేప్‌లు చేసేవాళ్ళ కాళ్ళూ, చేతులూ నరికేసే శిక్ష విధించాలని ఒక మహిళా నాయకురాలు అన్నారు. ఒక మహిళగా ఆవిడ తన కోపాన్ని, ఆవేదనని వెళ్ళగక్కడం మనం అర్ధం చేసుకోవచ్చు. రేప్ అనేది అత్యంత దుర్మార్గమైన నేరం. అందువల్ల రేప్ నేరస్తుల పట్ల నాకేవిధమైన సానుభూతీ లేదు.

నేను పీజీ చేసేప్పుడు సమిత్ రాయ్ నాకు సీనియర్ (ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిలయ్యాడు). నేను మొదటి సంవత్సరంలో వుండగా - 'సొసైటీ అండ్ క్రైమ్' అనే అంశంపై సెమినార్ లెక్చర్ ఇచ్చాడు. వివిధ సమాజాల్లో నేరాన్నీ, నేరస్వభావాన్నీ ఎవరు ఎలా అర్ధం చేసుకున్నారో - ఆ అవగాహనలోని లోపాల్నీ వివరంగా, ప్రతిభావంతంగా చెప్పాడు. అటు తరవాత జరిగిన చర్చలో ఎన్నో రిఫరెన్సుల్ని ఉటంకిస్తూ చాలా ఆసక్తికర విషయాల్ని ప్రస్తావించాడు సమిత్ రాయ్.

సెకండ్ యూనిట్ ప్రొఫెసర్ అననే అన్నాడు - "సమిత్! నువ్వు నేరస్తుల తరఫున వాదిస్తున్నట్లుగా వుంది!"

సమిత్ రాయ్ ఒక క్షణం ఆలోచించి అన్నాడు - "ఏమో! అయ్యుండొచ్చు. అందరూ నేరస్తుల్ని అసహ్యించుకుంటారు. ఇదో స్టీరియోటైప్ ఆలోచన. కానీ - మనం నేరాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించాలి. ఒక సమాజమే నేరమయంగా అయిపోతున్నప్పుడు, నేరస్తులు దాని బై ప్రొడక్ట్స్ మాత్రమే. ఫ్యాక్టరీలో వేస్ట్‌ని తగ్గించుకోటానికి ప్రయత్నిస్తామే కానీ - అసహ్యించుకోం కదా!" సమిత్ వాదన ఇలా సాగింది.

ఆరోజు సమిత్ రాయ్ వాదన పూర్తిగా ఎకడెమిక్‌గా సాగింది. నాకు ఇవ్వాళ కాళ్ళూ చేతులూ నరకే శిక్ష చదవంగాన్లే సమిత్ గుర్తొచ్చాడు. మిత్రమా! సీనియర్ గా నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీ గైడెన్స్ వల్ల నేను చాలా లాభ పడ్డాను. అందుకు నీకు కృతజ్ఞతలు.

ఇంక రాయడానికి పెద్దగా ఏం లేదు. మీరు చాలాచోట్ల చాలాసార్లు చదివిన విషయాలే.

నేరాలు జరగడానికి అనేక కారణాలున్నాయి. ఆర్ధిక పరమైన కారణాలు (కరువు జిల్లాల్లో నేరాలు ఎక్కువ), సామాజిక పరమైన కారణాలు (బీహార్‌లో నేరాలు ఎక్కువ), మత్తు పదార్ధాల వాడకం (ఆల్కహాల్ వాడకానికీ నేరాలకి సంబంధం వుంది. కానీ మన ప్రభుత్వాలు ఈ పాయింట్ పట్టించుకోవు).. ఇట్లాంటివి చాలానే వున్నాయి. 

తీవ్రమైన నేరాలకి తీవ్రమైన శిక్ష డిటరెంట్ గా ఉంటుందని కొందరూ, అందుకు సరైన ఋజువు లేదని మరికొందరూ వాదిస్తారు. అంతకన్నా ముఖ్యంగా - మన దేశంలో సత్వర న్యాయం జరగట్లేదని నా అభిప్రాయం. ఇందుకు ఒక ఉదాహరణ చుండూరు హత్యల కేసు.