Friday 5 September 2014

చలో ఇజీవోడ


"వురే కోటేసూ! ఆ మూట జాగరత్తరోయ్! అరే బెమ్మంగా! నాయాలా ఏందిరా ఈ సరుదుడు? నీయమ్మ! ఆ గునపం ఆడ పడేసావేందిరా? సావాన్లు జాగరత్తరా యేబ్రాసోడా!"

"నాయనా! ఏంటి మీ హడావుడి?"

"అన్నా! ఇన్ని దినాలు రాజదాని ఏడోనని ఎదురుచూస్తా వున్నాం. ఇప్పుడు ఇజీవోడ అని చెప్పిన్రుగా! తట్టాబుట్టా సరుదుకొని ఆడకే పోతన్నాం!"

"మంచిది. మనకంటూ ఒక రాజధాని ఏర్పడ్డాక పరాయి కొంపన బ్రతకాల్సిన ఖర్మెందుకు?"

"అవునన్నా! ఎవురికైనా పని సొంత కొంపలోనే వుంటది గానీ - ఇంకేడుంటది?"

"ఆంధ్ర ప్రాంతం పట్లా, తెలుగు జాతి పట్లా మీ ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది నాయనా!"

"థాంక్సన్నా!"

"మీరేం చేస్తుంటారు?"

"అన్నా! నువ్వు పోలీసోడివా?"

"కాదు."

"పేపరోడివా?"

"కాదు గానీ - మీరేం చేస్తుంటారో చెప్పారు కాదు."

"చెప్పటానికేవుందన్నా? మేం దొంగలం. రాత్రేళ ఇళ్ళకి కన్నాలేసి దోచుకుంటాం. పగటేళ ఆడోళ్ళ మెడలో గొలుసులు నూకుతుంటాం."