Tuesday 30 September 2014

తెరేశ్‌బాబు


కవి పైడి తెరేశ్‌బాబు ఇక లేరు. నాకాయనతో పరిచయం లేదు. ఆయన 'విభజన గీత'తో మాత్రం చాలానే పరిచయం వుంది. ఆ పరిచయం కల్పించిన విశేఖర్‌గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 'తెరేశ్‌బాబు' - పేరులాగానే ఆయన కవిత్వం కూడా విశిష్టమైనది.

నాకు కవిత్వం గూర్చి కొంత తెలుసు, చాలా తెలీదు. శ్రీశ్రీ, శివసాగర్‌ల కవిత్వాన్ని ఇష్టంగా చదువుతాను. గోరేటి వెంకన్న పాటల్ని ఇష్టంగా వింటాను. కడుపు నిండా అన్నం తిని, ఏసీ చల్లదనంలో రాసుకుందామంటే ప్రేమగీతాలొస్తాయి కానీ, ప్రజల జీవితాలు రావు. అందుకు నిజాయితీ కావాలి, కమిట్‌మెంట్ కావాలి, లోతైన అవగాహన కావాలి. ముఖ్యంగా తళుకుబెళుకులకి లొంగని మొండిఘటం అయ్యుండాలి. ఇవన్నీ తెరేశ్‌బాబులో పుష్కలంగా వున్నాయి.

కొన్నాళ్ళుగా తెరేశ్‌బాబు ఆరోగ్యం బాగులేదని తెలుసు. చుండూరు కేసుని హైకోర్టు కొట్టేసిన సందర్భాన తెరేశ్‌బాబు రాసిన కవిత చదివాను - ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. ఒక్కోసారి దిండంత పుస్తకం కూడా చెయ్యలేని పని ఒక చిన్న కవిత చెయ్యగలదు. ఆ పని తెరేశ్‌బాబు అవలీలగా చెయ్యగలడు. తెరేశ్‌బాబు మళ్ళీ తన ఎకె 47 తో కాల్చడం మొదలెట్టాడు, ఇక ఆరోగ్యం కుదుటపడ్డట్లే అనుకున్నాను. 

తెరేశ్‌బాబుది పెద్ద వయసు కూడా కాదు. మనం ముక్కుపిండి మరీ వసూలు చేసుకోవాల్సిన కవితలు బోల్డన్ని బాకీ వున్నాడు. అయినా బాకీ ఎగ్గొట్టి వెళ్ళిపొయ్యాడు - నిర్లక్ష్యంగా! ఈ కవులింతే - దేన్నీ లెక్కజెయ్యరు! ఆఖరికి తమ జీవితాన్ని కూడా!