Wednesday, 24 September 2014

నా బ్లాగ్ రీడర్‌తో కొంచెంసేపు


"ఏవిఁటాలోచిస్తున్నావు?"

"ఈ ప్రపంచాన్నెలా బాగుచెయ్యాలా అని!"

"అందుకు ఒబామా వున్నాడు. ఒబామా వెనకాల లెక్కలేనన్ని అణ్వాయుధాలున్నాయి. ఇంక నీకేం పని?"

"అవును కదా! అయితే ఈ దేశాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచిస్తాను!"

"దేశాన్ని బాగు చెయ్యడానికి మోడీ వున్నాడు. మోడీ వెనుక 'లవ్ జిహాద్' అంటూ సంఘపరివారం వుంది. ఇంక నీకేం పని?"

"పోనీ రాష్ట్రాన్నెలా బాగుచెయ్యాలా అని ఆలోచించొచ్చా?"

"రాష్ట్రాన్ని బాగుచెయ్యడానికి చంద్రబాబు నాయుడున్నాడు. చంద్రబాబు వెనక తీవ్రంగా శ్రమించే నిస్పక్షపాత మీడియా వుంది. ఇంక నీకేం పని?"

"పోనీ మా ఊరినెలా.. "

"అందుకోసం ప్రజలెన్నుకున్న మునిసిపల్ కార్పొరేషన్ వుందిగా? ఇంక నీకేం పని?"

"నిజవేఁ! అయినా అవన్నీ నాకెందుకు? నా ఇంటినెలా చక్కబెట్టాలా అనేది ఆలోచించాలి గాని!"

"నీ ఇంటిని చెడగొట్టాలంటే నీ ఆలోచన కావాలి గానీ - చక్కబెట్టడానికైతే నీ భార్యుందిగా? ఇంక నీకేం పని?"

"సర్లే! కొద్దిసేపు ట్రెడ్‌మిల్ చేసుకుంటాను. ఆరోగ్యాన్నైనా కాపాడుకోవాలిగా!"

"పిచ్చివాడా! జననమరణములు దైవాధీనం. నీ బోడి ట్రెడ్‌మిల్‌తో దేవుడి చిత్తాన్ని మార్చగలవా?"

"కానీ 'ఆరోగ్యమే మహాభాగ్యము' అన్నారు పెద్దలు."

"ఆ పెద్దలే 'పాపి చిరాయువు' అని కూడా అన్నారు."

"మరిప్పుడు నేనేం చెయ్యాలి?"

"అలా జూ దాకా వెళ్ళి పెద్దపులితో ఒక సెల్ఫీ తీసుకోరాదా?"

"వామ్మో! పెద్దపులితో సెల్ఫీనా?"

"అవును. నాకు నిన్ను పెద్దపులితో చూడాలని ముచ్చటగా వుంది."

"ఇంతగా ముచ్చట పడుతున్నావు! ఇంతకీ ఎవర్నువ్వు?"

"హ్మ్.. నేన్నీ బ్లాగ్ రీడర్ని. నీ వెర్రిమొర్రి ఆలోచనల్ని చదివి బుర్ర తిరిగిపోయిన అభాగ్యుడను. నీనుండి తెలుగు బ్లాగుల్ని రక్షించాలనే సదాశయంతో ఇలా వచ్చాను."

"నా బ్లాగ్రాతలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలిగానీ - నన్ను చంపేందుకు కుట్ర పన్నడం అమానుషం."

"అవున్నిజవేఁ! ఒప్పుకుంటున్నాను. కానీ - నాకింతకన్నా వేరే మార్గం కనపడట్లేదు!"