Monday, 8 September 2014

ముద్దాయిలూ మనుషులే!


అభివృద్ధి అనగా ఏమి? కొందరి దృష్టిలో విశాలమైన రోడ్లు, ఆకాశాన్ని తాకే భవనాలు అవ్వచ్చు. మరికొందరి దృష్టిలో ఫార్ములా వన్ రేసులు, ఫ్యాషన్ మోడళ్ళ పిల్లి నడకలు అవ్వచ్చు. ప్రజలందరికీ కడుపు నిండా తిండానికి ఆహారం, విద్యావైద్య సదుపాయాలు వినియోగించుకోగల అవకాశాన్ని కలిగి వుండటాన్ని అభివృద్ధి అంటారని ఇంకొందరు అంటారు. ఎవరి వాదన వారిది. 

అయితే - 'పేదప్రజల' అభివృద్ధి నమూనా ప్రభుత్వాలకి నచ్చదు. ఎందుకంటే చాలా దేశాల్లో పేదవారుంటారు. వారిని కూడా అభివృద్ధి నమూనాలో జత చెయ్యాలంటే - ప్రభుత్వాలకి ఎంతో చిత్తశుద్ధి, నిజాయితీ కావాలి. అందువల్ల - రెండు వెడల్పాటి రోడ్లనీ, నాలుగు పొడుగుపాటి భవంతుల్ని నిర్మించి - వాటిని షోకేస్ చేసే 'సులభమైన' అభివృద్ధికే ప్రభుత్వాలు మొగ్గు చూపిస్తాయి. ఐదేళ్ళలో ఎన్నికలు ఎదుర్కోవాలసిన సగటు రాజకీయ పార్టీలకి అంతకన్నా వేరే మార్గం తోచదు మరి!

ఈ నేపధ్యంలో మొన్న ఐదో తారీఖున సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఎంతో ఆశాజనకమైనవి, ఆహ్వానించదగ్గవి. నిందితుడిపై నేరారోపణ ఋజువైతే విధించే గరిష్ట శిక్షలో సగం కన్నా ఎక్కువకాలం, బెయిల్లేకుండా జైల్లోనే వుండిపోతే - నిందితుణ్ని వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చెయ్యాలి. ఇందుకు న్యాయవాదులు సహాయం కూడా అవసరం లేదు.

నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని 'ముద్దాయి' అంటారు. కోర్టు ఆ ముద్దాయికి నేరాన్ని ధృవీకరించినప్పుడే ఆ వ్యక్తి 'నేరస్తుడు' అవుతాడు. ఈ దేశంలో లక్షలమంది ముద్దాయిలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. నేరం నిర్ధారణ అయితే - జైల్లో వున్న కాలాన్ని తగ్గించి శిక్ష అమలు చేస్తారు, కాబట్టి వారికి ఇబ్బంది లేదు. అదే - కోర్టు ఫలానా ముద్దాయి నేరం చెయ్యలేదని కేసు కొట్టేస్తే? అప్పటిదాకా ఆ వ్యక్తి జైల్లో గడిపిన కాలం - ఆ వ్యక్తి స్వేచ్చగా జీవించే న్యాయమైన, సహజమైన హక్కుని హరించివేసినట్లు కాదా? దీనికి ఎవరు జవాబుదారి?

ఈ సమస్యకి సత్వర న్యాయం (నేరాన్ని త్వరితంగా విచారించి వేగంగా తీర్పులు వెలువరించడం) ఒక పరిష్కారం. న్యాయవ్యవస్థలో సంస్కరణల గూర్చి అనేకసార్లు చర్చలు జరిగాయి, అనేక కమిటీలు రిపోర్టులూ ఇచ్చాయి. అమలు కోసం ప్రభుత్వాలు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి. కానీ - ప్రభుత్వాలు పట్టించుకోవు (వాటికి తరవాత ఎన్నికల్లో వోట్లు రాలే పథకాల పట్లే శ్రద్ధ).

అదేమంటే - నిధుల కొరత అంటారు. ముద్దాయిలుగా కొన్ని లక్షలమందిని జైళ్ళల్లో (అనవసరంగా) వుంటే వారి వసతి, పోషణ, నిఘాకి నిధులు కావాలి. మరప్పుడది ప్రజల సొమ్ము వృధా చేసినట్లు కాదా? ఇట్లాంటి విషయాల పట్ల దృష్టి వుంచాలంటే కావలసింది సమస్యల పట్ల సున్నితత్వం, శాస్త్రీయమైన అవగాహన.

సాధారణ నేరాలక్కూడా ముద్దాయిలుగా విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఏళ్ళూ, పూళ్ళూ గడిపెయ్యడంలో ఇంకో కోణం - ఆర్ధిక సామాజిక కోణం. ముద్దాయి బెయిల్ మంజూరు అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుగా వుండాలి. ఆ పూచీదారులకి హామీగా స్థిరాస్తో, బ్యాంకులో డబ్బో వుండాలి. పేదవాడికి ఇవన్నీ వున్న ఇద్దర్ని తెచ్చుకోలేడు. అంటే - బెయిలివ్వడానికి కోర్టు సిద్ధంగా వున్నా, హామీ ఇచ్చేవారు దొరక్క జైల్లోనే వుండిపోవాల్సిన పరిస్థితి!

పేదవారిలో ఎక్కువమంది రోజువారి కూలీపనులు చేసేవారే. అటువంటి సమాజంలో కుటుంబపెద్ద నేరారోపణని ఎదుర్కొంటూ ఎక్కువ కాలం జైల్లోనే వుండిపోతే ఆ కుటుంబానికి చాలా నష్టం. ఆ పిల్లలు దిక్కులేనివారై భవిష్యత్తుని కోల్పోతారు. ఇది పిల్లల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది.

అందువల్ల - ఇటువంటి నిస్సహాయుల పట్ల ప్రగతిశీలమైన ఆలోచన చేసి, ఈ సమాజానికి మేలు చేకూర్చే ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టుని మనస్పూర్తిగా అభినందిస్తూ - భవిష్యత్తులో కూడా సుప్రీం కోర్టు ఇదేవిధంగా పేదల పక్షపాతిగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.