Saturday 13 September 2014

మా గుంటూరు స్మార్ట్ సిటీ ఆయెనె!


"మన గుంటూర్ని స్మార్ట్ సిటీగా చేస్తున్నార్ట!"

బద్దకంగా బ్రష్ చేసుకుంటుంటే - తెలుగు పేపర్ చూస్తున్న నా భార్య వ్యాఖ్య.

పొద్దున్నే ఎంత తీపివార్త! మా గుంటూరు ఇక ప్రపంచ పటంలో ఉదయ చంద్రుని వలె ప్రకాశించబోతుంది.

ఈ వార్త విన్నంతనే అనేక ఆలోచనలు సుడులు తిరగనారంభించాయి. కొంతసేపటికి ఆలోచనల సుడులు జలపాతాలై ప్రవహించసాగాయి.

నేను ఎనిమిదో క్లాసులో వుండగా, నా మేనమామ పెళ్ళి చేసుకున్నాడు. ఆయన పుస్తకాలు చదివేవాడు, పాటలు పాడేవాడు, నాకు కొనుక్కోడానికి పది పైసలిచ్చేవాడు. పెళ్లిరోజు - పెళ్ళిపీటల మీద కూర్చున్నంతసేపూ భార్య చెవిలో ఏదో చెబుతూనే వున్నాడు. ఆవిడ సినిమాలో సావిత్రిలాగా సిగ్గుగా, ముసిముసిగా నవ్వుతుంది. మావయ్య - హిట్టైన తెలుగు సినిమా హీరోలా విజయగర్వంతో నవ్వుతున్నాడు. మావయ్య ఎందుకంతలా నవ్వుతున్నాడో నాకర్ధం కాలేదు.

పెళ్ళిపనుల్తో హడావుడిగా వున్న అమ్మని అడిగాను. 

"అమ్మా! మావయ్యెందుకలా నవ్వుతున్నాడు?"

అమ్మకి నా ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పాలో తోచనట్లుగా ఒకక్షణం ఆలోచించి - 

"పెళ్ళంటే అంతే! సంతోషంగా వుంటుంది." అంది.

ఓహో అలాగా! నోట్ ద పాయింట్. పెళ్ళైతే సంతోషంగా వుంటుంది, నవ్వొస్తుంటుంది కూడాను!

కానీ - కొన్నాళ్ళకి మావయ్య ఎందుకో నవ్వడం తగ్గించాడు. మరికొన్నాళ్ళకి నవ్వడం మానేశాడు. ఇంకా మరికొన్నాళ్ళకి మొహం చిట్లించసాగాడు! ఆయన మొహం క్రమంగా అలా మారిపోవడానికి కారణం మా అత్తయ్యేననే అనుమానం నాలో వుండిపోయింది. అయితే - ఆధారాల్లేకుండా రాయడానికి నేనేమీ తెలుగు పత్రికా విలేఖరిని కాను. కావున - ఈ విషయం ఇంతటితో వదిలేస్తాను.

నేను ఇంటర్మీడియేట్ చదివేప్పుడు కోటంరాజు రంగారావుగారి దగ్గర కెమిస్ట్రీ ట్యూషన్ చెప్పించుకున్నాను. ఒకరోజు ఆయన పాఠం చెప్పకుండా హిందూ పేపర్లోని వార్తొకటి పెద్దగా చదివారు. మన దేశం అణుబాంబు పరీక్షని విజయవంతంగా జరిపిందని ఆ వార్త సారాంశం. ఇవ్వాళ్టినుండి మనం కూడా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఒక ఉచితాసనం పొందామని ఆయన సెలవిచ్చారు. ఆ తరవాత ఆరోజు ట్యూషన్‌కి కూడా సెలవిచ్చారు.

అందరితోపాటు సంతోషిస్తున్నట్లుగా ఒక వెలిగిపొతున్న మతాబా మొహం పెట్టాను. కానీ - నాకు దీపావళప్పుడు పేల్చే తాడుబాంబుకీ, భారద్దేశం పేల్చిన అణుబాంబుకీ తేడా తెలీలేదు. ఇక్కడ అందరికీ అంతా తెలిసినట్లుంది. నేనొక్కడినే వాజమ్మనన్న మాట!

అందువల్ల - నా అత్మీయ మిత్రుడూ, సహ మతాబా అయిన సూర్యం (ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ పోస్టులో వున్నాడు) చెవిలో చిన్నగా అడిగాను - "మన్దేశం అణుబాంబు పేలిస్తే ఏమవుతుంది?" అని.

ఉన్నట్టుండి సూర్యం మేధావిలా గంభీరంగా అయిపొయ్యాడు. నావంటి అ-మేధావికి ఎలా చెబితే విషయం అర్ధమవుతుందా అన్నట్లు సీరియస్‌గా మొహం పెట్టి ఒకక్షణం ఆలోచించాడు.

"ఈ క్షణం నుండి మనం అమెరికాతో సమానమైపొయ్యాం. ఇకపైన ఆకాశంలో ఒకటే విమానాలు, హెలీకాప్టర్లు. మీ ఇల్లూ, మా ఇల్లూ పదంతస్తుల మేడగా మారిపోతాయి." అని చెప్పాడు.

నాకు చాలా సంతోషం కలిగింది. సినిమాల్లో చూడ్డవేఁ గాని నేనెప్పుడూ విమానాల్ని చూళ్ళేదు. నేను ఎక్కిన అతి ఎత్తైన కట్టడం మా హిందూ కాలేజి రెండో అంతస్తు. నాకు రెండో అంతస్తులోంచి కిందకి చూస్తేనే కళ్ళు తిరిగేవి. అదే పదంతస్తులయితే వాంతే అవుతుందేమో!

ఆ రోజు నుండి వీలయినప్పుడల్లా తల పైకెత్తి ఆశగా ఆకాశం వైపు చూస్తూనే వున్నాను. కాకులు తప్పితే ఏవీఁ కనిపించట్లేదు, మెడనొప్పి తప్ప ఏవీఁ మిగలట్లేదు. కొన్నాళ్ళకి సూర్యం అమెరికా వెళ్ళిపొయ్యాడు.

అణుబాంబు పేల్చి మనం కూడా అమెరికాతో సమానమైనప్పుడు - మా సూర్యం ప్రత్యేకంగా టిక్కెట్టు కొనుక్కుని మరీ అమెరికా ఎందుకెళ్ళాడో అర్ధం కాలేదు! ఇది డబ్బులు వృధా చేసుకోడమేనని నా అభిప్రాయం. అణుబాంబు గూర్చి అంత తెలిసిన మా సూర్యంకి, ఇట్లాంటి చిన్నవిషయాల పట్ల అవగాహన లేకపోడం విచిత్రం కాక మరేవిటి?

సూర్యం ఆలోచన సైన్స్ ఫిక్షన్లో ప్రెడిక్షన్‌లాగా మిగిలిపోయింది. మా ఇళ్ళు పదంస్తుల మేడలుగా మారడం అటుంచి -  ప్రస్తుతం పాడుబడి కూలిపోడానికి సిద్ధంగా వున్నాయి. ఆ విధంగా నలభయ్యేళ్ళ క్రితం అణుబాంబు పేల్చినా - మేవఁనుకున్న మార్పు రాలేదు. కావున ఈ విషయవూఁ ఇక్కడితో వదిలేస్తాను.

హమ్మయ్యా! నా ఆలోచనల సుడులు, జలపాతాలూ రాసేశాను. ఇప్పుడు హాయిగా వుంది!

ఇకిప్పుడు వర్తమానంలోకి వస్తాను.

మా గుంటూర్ని స్మార్ట్ సిటీగా మార్చేస్తున్న కృష్ణార్జునుల వంటి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు (వీరిలో ఎవరు కృష్ణుడో, ఎవరు అర్జనుడో నాకు తెలీదు) గార్లకి మా గుంటూరు ప్రజల తరఫున - కృతజ్ఞతతో కరిగిపోతూ, వినయంతో వొంగిపోతూ, ఆనంద భాష్పాలు కారుస్తూ - 2090 వరకూ కూడా మీరే మన నాయకులుగా వుండిపోవాలని ఆ భగవంతుని ప్రార్ధిసూ -

ఒక (భవిష్యత్) స్మార్ట్ సిటీ పౌరుడు.


ముగింపు -

ఇంతకీ - 'స్మార్ట్ సిటీ' అనగానేమి?

(నాకు మాత్రం ఏం తెలుసు?)

ఇన్నాళ్ళూ గుంటూరు నాలాంటి స్మార్ట్ పీపుల్‌కి నిలయంగా వుంది. ఇకముందు ఊరికి ఊరే స్మార్ట్‌గా అయిపోతుంది! అదీ సంగతి!

సొల్లు చెప్పకు, తెలిస్తే సరైన సమాధానం చెప్పు. లేదా నోర్మూసుకో!

(పెళ్ళిసందేహం తీర్చిన అమ్మ మంచాన వుంది. అణుబాంబు గూర్చి అణువంత విడమర్చిన సూర్యం దూరంగా వున్నాడు. ఇప్పుడెలా? ఏదోటి చెప్పి గుంటూరు పరువు కాపాడాలి. లేనిచో - గుంటూర్ని స్మార్ట్ సిటీ అనకపోతే పోయె, ఈడియట్ సిటీ అంటారేమో! )