Monday 5 August 2013

ఎందుకు?


హైదరాబాదు మన కోస్తా ప్రాంతం నుండి విడిపోయినందుకు మనం చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నాం. అందుకే మన కుర్రాళ్ళు రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతూ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఈ చైతన్యం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది.

మన ప్రజలు, మన ప్రాంతం, మన భాష అంటూ ఆలోచిస్తూ.. నష్టం జరిగిందని భావిస్తే రియాక్ట్ అవ్వడం చాలాచాలా మంచిది (అది ఎంత ఆహేతుకమైనా ఆ స్పాంటేనియస్ రియాక్షన్ ని నేను సమర్దిస్తాను). ఆనందించదగ్గది. ప్రపంచంలో ఏ జాతికైనా ఇటువంటి లక్షణం కలిగి ఉండటం చాలా అవసరం. ఇది ఆ జాతి ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుంది.

అందుకే ఎమోషనల్ గా ఆలోచిస్తే నా ప్రాంతానికి హైదరాబాదేం ఖర్మ? ముంబాయి, న్యూయార్క్ మహానగరాలు కూడా కావాలనిపిస్తుంది. ఇట్లా వాదించడం నాకు ఇష్టంగానే ఉంటుంది గానీ కష్టంగా ఉండదు. కానీ మన ఇష్టం వేరు.. రాజకీయ అవగాహన, ఆలోచన, అంచనాలు వేరు.

అయితే.. మన యువతకి 'ప్రశాంత' సమయంలో ఇంకేం పట్టదా? ఏమీ కనిపించవా? వినిపించవా? ఎందుకంత అలసత్వం, అంతులేని బాధ్యతా రాహిత్యం? గత కొన్నిరోజులుగా ఈ ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇబ్బంది పెడుతున్నాయి.

నిత్య జీవితంలో సాధారణ జీవనానికి ఎన్ని కష్టాలు! మనిషి మనిషిగా, గౌరవంగా బ్రతికే పరిస్థితుల నుండి ఎంతగా దిగజారిపోతున్నాం! డాక్టర్లు పేషంట్లని పీల్చేస్తారు. ప్లీడర్లు క్లయింట్లని మింగేస్తారు. ఒంటరి ఆడపిల్లకి కనీస రక్షణ కల్పించలేని దిక్కుమాలిన సమాజం సృష్టించుకున్నాం. అడవిలో పులుల కన్నా ప్రమాదకరంగా తయారవుతున్నాం. ఏం? వీళ్ళెవరూ మన ప్రాంతం వాళ్ళు కాదా? అప్పుడీ కుర్రాళ్ళు ఆవేశపడరెందుకు!

'ప్రశాంత' సమయంలో మన అభిమాన హీరోల (కుల) ర్యాలీలు అద్భుతంగా నిర్వహిస్తాం. ఓటుకి ఎవడెంత ఇచ్చాడనేది ఉత్సాహంగా చర్చించుకుంటాం. ఏం? ఇవన్నీ మన ప్రాంతానికి నష్టం కలిగించట్లేదా? కేవలం హైదరాబాద్ మనది కాదన్నప్పుడే ఎందుకీ ఆవేశం? అసలు మనకి ఉన్న ప్రాంతాన్ని సరీగ్గా పరిరక్షించుకుంటున్నామా? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకుంటున్నామా? లేదు కదా! ఎందుకు?

కారంచేడు, చుండూరులతో ప్రపంచ పటాన్ని ఎక్కాం. ఎంత సిగ్గుచేటు! మరి మరణించిన ఆ దళితులు మన ప్రాంతంవారు కాదా? ఒక కులం ఇంకో కులం మీద దాడి చెయ్యడం, పశువుల కన్నా హీనంగా చంపెయ్యడం ఘోరం, అమానుషం అని ఖండిస్తూ ఎప్పుడైనా ర్యాలీలు చేశామా? లేదు కదా. ఎందుకు?

నకీలీ విత్తనాలు, పురుగు మందులు, గిట్టుబాటు కాని రేట్లతో ఎంతమంది రైతులు చచ్చిపొతున్నారు? ఎంతమంది కిడ్నీలు అమ్ముకుంటున్నారు? మనం అప్పుడు ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ రైతుల పక్షాన ఎన్ని ర్యాలీలు తీశాం? వారి మరణానికి గల కారణాన్ని వెతికి వెతికి పట్టుకుని పీక పిసికి చంపేంత కోపం మనకి ఎందుకు రాలేదు! ఏం? ఆ మరణించిన రైతులు మన ప్రాంతంవారు కాదా?

ఇవ్వాళ హైదారాబాద్ కోసం చెలరేగిన ఆవేశంలో పది పైసలైనా దాచుకుందాం. అలసత్వాన్ని, అరాచాకత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఎదిరిద్దాం.. మాట వినకపోతే పాతరేద్దాం. ఇప్పుడు ప్రశ్నించుకోవలసింది మనం ఏ ప్రాంతం వాళ్ళమని కాదు.. మనమందరం ఒక జాతిగా, సామూహిక శక్తిగా ఎలా పురోగమించాలని మాత్రమే. అప్పుడు మనం కోల్పోతున్నామనుకుంటున్న ఒక కాంక్రీట్ జంగిల్ పెద్ద నష్టమేమీ కాదు. నాకైతే మన యువతపై అంతులేని ఆశలున్నాయి. ఈ ఆశ దురాశ కాదనే నమ్మకం కూడా ఉంది.

(photo courtesy : Google)