Monday 26 August 2013

చరిత్ర మార్చుకున్న ఆంధ్రప్రదేశ్


"మావాఁ! ఒకపక్క సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. నువ్వేమో తాపీగా చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నావు."

"ఉరే అల్లుడూ! నేనేమీ నీకు లాగా ఇంజినీరింగ్ చదువుకుని పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యట్లేదు. ఏదో పదో క్లాసు వెలగబెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాను. నా చుట్ట నన్ను కాల్చుకోనీ."

"చదువుకోకపొతే మాత్రం నువ్వు మనిషివి కాదా? నీకు మాత్రం బాధ్యత ఉండదా? అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్రప్రదేశ్ ని ముక్కలుగా చేసి, హైదరాబాదుని తెలంగాణా వాళ్ళు కాజేస్తున్నారు. మనం మన హైదరాబాదుని కాపాడుకోవాలి."

"అల్లుడూ! ఇలా చెబుతున్నానని ఏమనుకోమాక. చిన్నప్పుడు నేనూ సాంఘిక శాస్త్రం చదువుకున్నాను. మా పుస్తకాల్లో పొట్టి శ్రీరాములు 1952 లోనే మరణించారని రాశారు. ఆయన మద్రాసు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడాలని నిరాహార దీక్ష చేశాడు. అసువులు బాశాడు. ఇప్పుడు దీక్షలు చేసేవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా సెలైన్ కడుతున్నారు. పొట్టి శ్రీరాములు విషయంలో ఆనాటి పోలీసులు, డాక్టర్లు ఊరుకున్నారు. కారణం తెలీదు."

"మావాఁ! ఇప్పుడు ఉద్యమం చేస్తున్న రాజకీయ నాయకులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి నీపాటి జ్ఞానం లేదనుకోకు."

"అంతమాట నేనంటానా అల్లుడూ?"

"మావాఁ! పాఠ్యపుస్తకాలు ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్లు వస్తుంటాయి. సబ్జక్టు కూడా మారుతుంటుంది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందనేవాళ్ళు. మరిప్పుడు భూమి గుండ్రంగా ఉందని రాయట్లేదూ?"

"అల్లుడూ! సైన్స్ మారుతుంటుంది గానీ.. చరిత్ర ఎట్లా మారుతుంది?"

"అక్కడే పప్పులో కాలేశావు మావాఁ! ఏదీ నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకం ప్రకారం ప్రధానమంత్రి ఎవరో చెప్పు?"

"ఇందిరాగాంధీ."

"మరిప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రా? మన్మోహన్ సింగు కదా!"

"నిజవే అల్లుడూ!"

"మావాఁ! నీది మిడిమిడి జ్ఞానం. నీకు చరిత్ర తెలీదు. చెప్పినా అర్ధం చేసుకోలేవు. సైన్స్ సబ్జక్టు లాగే సోషల్ సబ్జక్టూ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. లేటెస్ట్ సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారం పొట్టి శ్రీరాములు హైదరాబాద్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 1956 లో అమరజీవి అయ్యాడు."

"నిజంగా!"

"ఇది పచ్చి నిజం. ఆయన ప్రాణ త్యాగ ఫలితంగానే హైదరాబాదుతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ మహానుభావుని ఆత్మ బలిదానం మనం వృధా పోనియ్యరాదు. అర్ధమైందా? చుట్ట కాల్చడం అయ్యిందిగా. ఇంక ఉద్యమ దిశగా నడువు."

"వార్నీ! ఈ మధ్య కాలంలో చరిత్ర మరీ ఇంత దారుణంగా మారిపోయిందా అల్లుడూ? సర్లే! అర్జంటుగా చెంబుకెళ్ళాల. ముందు నువ్వెళ్ళు. పని పూర్తి చేసుకుని ఎనకమాలగా నేనొచ్చెస్తా."


(photos courtesy : Google)