Thursday, 22 August 2013

కాకిగోల


"రవణ మావా!"

"ఊఁ"

"ఈ మధ్య కాకులు పెద్దగా కనబడట్లేదేంటి?'

"నేనూ నిన్నటిదాకా అలాగే అనుకున్నాను సుబ్బు. కానీ పొద్దున్న టీవీ చూశాక కాకుల ఎడ్రెస్ తెలుసుకున్నాను."

"టీవీల్లో కాకులా!"

"అవును. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా ఈ మధ్య ఒకటే కాకిగోల. టీవీల వాళ్లకి వార్తలు లేక ఏవో పనికిమాలిన చర్చా కార్యక్రమాలు పెడుతుంటారు. అక్కడ చర్చ ఉండదు. ఏవో పిచ్చికేకలుంటాయి. మనకి ఏవీ అర్ధం కాదు."

"వాళ్ళ ఉద్దేశ్యం కూడా మనకి అర్ధం కాకూడదనే రవణ మావా!"

"తెలుగు టీవీల్లో చర్చా కార్యక్రమాలు చాలా నాసిగా ఉంటాయి. రాజకీయాల్లో, మీడియాలో పన్లేని నిరుద్యోగులతో ఇవి నిర్వహిస్తున్నట్లుగా అనిపిస్తుంది."

"నేనైతే ఈ ప్రోగ్రాములు చూడను. కాబట్టి నాకు తెలీదు. అయితే ఈ వాగుళ్ళకి, కాకిగోలకీ కల సంబంధమేమి?"

"కాకులు కూడా టీవీ చర్చల్లాగే గోలగోలగా అరుస్తుంటాయి సుబ్బూ."

"నీ పోలిక సరికాదు. కాకులు కష్టజీవులు. కాకి అనే జీవి లేకపోతే మన పర్యావరణం దెబ్బ తింటుంది. కాకుల భాష మనకి అర్ధం కాదు కాబట్టి మనం వాటి అరుపుల్ని 'కాకిగోల' అని హేళనగా అనుకుంటాం. కానీ కాకుల అరుపుకి చాలా స్పష్టమైన అర్ధం ఉంటుంది. అవి వాటి భాషలో ఒకదానికొకటి హెచ్చరించుకుంటాయి. తమలో ఒకరు చనిపోతే సామూహికంగా సంతాప సందేశాన్ని ప్రకటిస్తాయి."

"అవును. కాకుల్లాగే జంతువులు కూడా సంఘజీవులే సుబ్బూ."

"అంతేకాదు. మనుషుల్లో మంచితనం ఉండదు. అయినా 'మానవత్వం' అనే పదం సృష్టించుకున్నాం. కాకులకి మంచితనం అనేది ఒక సహజగుణం. అయినా తెలుగు భాషలో 'కాకిత్వం' అనే పదం లేదు. తెలుగు భాషలో తమకి జరిగిన అన్యాయం కాకులకి తెలీదు. తెలిసినట్లైతే అవి మనని ముక్కుతో పొడిచి చంపేసేవి!" అన్నాడు సుబ్బు.

"ఓకే. ఒప్పుకుంటున్నాను. మరప్పుడు కాకిగోల అని ఎందుకంటాం సుబ్బూ?"

"ఇట్లాంటి పదప్రయోగాలు తెలుగు భాషలో ఒక పెద్ద లోపం. ఉదాహరణకి 'క్రూరమృగం' అంటాం. నిజానికి ఏ మృగం కూడా క్రూరమైంది కాదు. ఒకరకం జాతి జంతువులు, ఆకలి వేసినప్పుడు ఇంకోరకం జాతి జంతువుల్ని కష్టపడి వేటాడి చంపుకుని తింటాయి. అది ప్రకృతి ధర్మం. అలా చెయ్యకపోతే అవి ఆకలితో చస్తాయి. ఇందులో క్రూరత్వం ఏముంది? చంపడం అనే ఒక్క అంశాన్ని తీసుకుని, దానికి మన value judgement జోడించి 'క్రూరమృగం' అంటున్నాం."

"అవున్నిజం."

"ఈ మధ్య జర్నలిస్టులకి సైతం పైత్యం ఎక్కువైంది. అందుకే రేపిస్టులకి 'మృగాడు' అని బిరుదులిస్తున్నారు. ఇట్లా నీచోపమానాలకి జంతువుల పేర్లు వాడుకోవటం వాటి మనోభావాలు దెబ్బ తియ్యడమే కాదు.. వాటి  హక్కుల ఉల్లంఘన క్రిందకి కూడా వస్తుంది."

"ఓకే. నా 'టీవీ చర్చలు ఒక కాకిగోల' స్టేట్మెంటుని వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రశ్న నేనడుగుతున్నాను. కాకులు ఎందుకని పెద్దగా కనబట్లేదు? ఏమై ఉంటాయి సుబ్బూ?"

"నాకైతే ఫ్రిజ్ లొచ్చి కాకుల్ని దెబ్బకొట్టాయని అనిపిస్తుంది."

"ఎలా?"

"సింపుల్. ఇంతకుముందు అంట్లు కడిగేప్పుడు మిగిలిన అన్నం అవతల పడేసేవాళ్ళం. కాకులకి అలా విసిరేసిన మెతుకులే విందుభోజనం. ఇప్పుడు చద్దన్నాలు ఫ్రిజ్జుల్లొ పెట్టుకుని మనమే తినేస్తున్నాం. ఇది గ్రహించిన కాకులు, మన దరిద్రానికి జాలిపడి, మన ఇళ్ళ వైపు రావడం మానేశాయి."

"అవునా సుబ్బూ!"

"అవును. కానీ కాకులు మనవైపు రాకపోతే నష్టపొయ్యేది మనమే. కాకులు కాదు. ఇంతటితో మన కాకిగోల ఆపేద్దాం."


(photos courtesy : Google)