Thursday 22 August 2013

మానసిక రోగులూ మనుషులే


'ఫలానా నాయకుడికి పిచ్చెక్కింది.'

'ఫలానా నాయకుడిని పిచ్చాసుపత్రిలో చేర్పించి మా ఖర్చుతో వైద్యం చేయిస్తాం.'

ఈ మధ్య కొందరు రాజకీయ నాయకుల భాషలో ఇలాంటి కొత్త 'తిట్లు' వచ్చి చేరాయి. ఇంకొందరు ఒకడుగు ముందుకెళ్ళి ప్రభుత్వాసుపత్రిలోని మానసిక వైద్య విభాగాధిపతికి 'ఫలానా నాయకుడికి మానసిక వైద్యం అవసరం' అంటూ మీడియా సాక్షిగా వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు!

ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దుర్మార్గమైన ధోరణి. మానసిక రోగులు నేరస్థులు కాదు. బీపీ, షుగర్ పేషంట్ల లాగా సైకియాట్రీ పేషంట్లు కూడా ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. మానసిక వైద్యం అనేది వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బు వస్తుంది. మానసిక జబ్బులు మెదడులో కల న్యూరోట్రాన్మిటర్లలో సంభవించే రసాయన మార్పుల వల్ల వస్తున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు. విజ్ఞత కలిగిన వారెవరైనా మానసిక వైద్యం చేయించుకుంటున్న వారి పట్ల సానుభూతిగానే ఉంటారు. మరి మన పొలిటికల్ సెక్షన్‌కి మానసిక రోగుల పట్ల ఎందుకింత పరిహాసం? ఎందుకింత బాధ్యతా రాహిత్యం? ఇది వారి అవగాహన లోపమా? లేక నిర్లక్ష్యమా? 

అసలే మన దేశంలో మానసిక రోగాల పట్ల అవగాహన తక్కువ. సామాన్య ప్రజలు ఈ రోజుకీ దెయ్యాలు, భూతాలు, చేతబడి వంటి నమ్మకాలతో తమ విలువైన సమయాన్ని, డబ్బుని నష్టపోతున్నారు. మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే సమాజం తమని 'పిచ్చివాడు' అనే ముద్ర వేస్తుందేమోనని భయపడుతున్నారు.

అందుకే ఏపీ సైకియాట్రిక్ అసోసియేషన్ మానసిక వైద్యం పట్ల ప్రజల అవగాహన మెరుగు పరచడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మానసిక వైద్యులు కూడా ఈ రంగంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. తద్వారా ఇప్పుడిప్పుడే సామాన్య ప్రజలలో అవగాహన కొంత మెరుగవుతుంది.

మన నాయకులు మాత్రం తమ రాజకీయ భాషలో 'పిచ్చి', 'పిచ్చెక్కింది' వంటి అనాగరిక పదాలు వాడుతూ సమాజానికి నష్టం చేకూరుస్తున్నారు. ఈ రకమైన 'పిచ్చి' భాష మానసిక వైద్యం పొందుతున్న వారికి ఆవేదన కలిగిస్తుంది. ఈ భాష ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకి విరుద్ధం కూడా. కావున ఇట్లాంటి భాష మాట్లాడకుండా కఠినమైన నిబంధనలు విధించడమే కాకుండా... ఇలా మాట్లాడ్డం నేరంగా పరిగణించేలా కూడా వెంటనే చట్టంలో మార్పు తేవాలి.

- యడవల్లి రమణ

(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో పబ్లిష్ అయ్యింది)

(picture courtesy : Google)