Tuesday, 20 August 2013

జరుగుతున్న కథ


పైనేదో మర్డర్ జరిగినట్లు నెత్తుటి గడ్డలా ఎర్రగా ఉంది ఆకాశం. ఫ్యాక్షనిస్టు సినిమాల్లో విలన్ కొంపలా విశాలంగా ఉందా ఇల్లు. హాలు మధ్యనున్న ఓ పేద్ద సోఫా.. ప్రజల రక్తం తాగే దుర్మార్గపు రాజు కూర్చునే సింహాసనంలా ఉంది. దానిపైనున్న ఆకారం రావు గోపాలరావు లాంటి ఆ ఊరి ప్రెసిడెంటుది.

ప్రెసిడెంటు చుట్ట తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా అల్లు రామలింగయ్య లాంటి జోగినాధం వినయంగా వంగిపోతూ నించునున్నాడు. వాతావరణం కడు గంభీరంగా ఉంది.

"జోగినాధం! ఏంటి ఊళ్ళో హడావుడి?" చుట్ట పొగ గుప్పున వదుల్తూ అడిగాడు ప్రెసిడెంటు.

ఇబ్బందిగా కదిలాడు జోగినాధం.

"చిత్తం. ఏదో చిన్నపాటి గొడవే లెండి. ఆ ఈరిగాడి కొడుకుల ఆస్థి తగాదా ఈనాటిదా? యాభయ్యారేళ్ళుగా నలుగుతుంది. తమరు ధర్మప్రభువులు.  ప్రజల కోరికపై ఎంతో ధర్మబద్దంగా ఆస్థి పంపకాలు కావించారు. ఇప్పుడా ఇల్లు తమ్ముడి వైపు పోయిందని అన్న నానా యాగీ చేస్తున్నాడు."

"అదేంటి జోగినాధం? ఈ సమస్య చాల్రోజుల్నించి పెండింగులో ఉందనీ, మనం చెప్పినట్లు నడుచుకుంటామని అన్నది వాళ్ళే కదా?" చిటపటలాడాడు ప్రెసిడెంటు.

"చిత్తం. కూలెదవలు కదండీ? పూటకో మాట మారుస్తారు. రెండ్రోజులు కడుపు కాల్తే వాళ్ళే దారికొస్తారు." భరోసాగా అన్నాడు జోగినాధం.

ఇంతలో హడావుడిగా వచ్చాడు సాక్షి రంగారావు లాంటి పంతులు.

"అయ్యా అయ్యా దొరవారు! ఘోరం జరిగిపోతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో లబ్ది పొందడం కోసమే మీరు తప్పుడు తీర్పు చెప్పారని ఆ నాగభూషణం మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా అయితే మనకి ముందుముందు కష్టమే సుమండీ." అంటూ నశ్యం ఎగబీలుస్తూ దీర్ఘం తీశాడు పంతులు.

'నువ్వు నోర్మూసుకో' అన్నట్లు పంతులు వైపు గుడ్లురుమి చూశాడు జోగినాధం. విషయం అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు పంతులు.

"నాయాల్ది. ఆ భూషణం గాణ్ని యేసెయ్ మంటారా దొరా?" కర్ర తీసుకుని లేచాడు ఆర్. నాగేశ్వర్రావు లాంటి బాబులు గాడు.

"నువ్వూరుకోవో. ఎప్పుడు ఏది చెయ్యాలో అదే చెయ్యాల. ఇప్పుడు కాదు.. ముందుముందు నీకు చాలా పనుందిలే." అంటూ బాబులు గాణ్ని ముద్దుగా విసుక్కున్నాడు ప్రెసిడెంటు.

ఆపై ఆరిపోయిన చుట్ట వెలిగించుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు.

'అంటే ఊళ్ళో నాగభూషణం నాయకత్వంలో నామీదే ఎగస్పార్టీ తయారవుతుందన్న మాట. విషయం అందాకా వచ్చిందా! ఇప్పుడేం చెయ్యాలి?'

"మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మీరు వాళ్ళ గూర్చి పట్టించుకోకండి. వాళ్ళ మొహం, వాళ్ళెంతా? వాళ్ళ బతుకులెంతా?" కళ్ళజోడు పైకి లాక్కుంటూ అన్నాడు జోగినాధం .

జోగినాధం వైపు సాలోచనగా చూసాడు ప్రెసిడెంటు.

ఆ విధంగా తీవ్రంగా యోచించిన ప్రెసిడెంటు కొద్దిసేపటికి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి భయపడ్డాడు పంతులు. ప్రెసిడెంటు నవ్వులో సంతోషం లేదు. లేడిని చంపబోయ్యే ముందు పులిలో కనిపించే క్రూరత్వం ఉంది. ప్రెసిడెంటు నవ్వులో అమాయకత్వం లేదు. ముక్కుపుడక్కోసం ముక్కుపచ్చలారని చిన్నారిని నలిపెయ్యబొయ్యే కసాయివాడి కఠినత్వం ఉంది.

దొరవారు కొద్దిసేపు వారి నీచదుర్మార్గపు నవ్వు నవ్వి జోగినాధం వైపు సర్దాగా చూశారు.

"జోగినాధం! నీకో పని చెబుతున్నాను. జాగర్తగా విను. కొన్నాళ్ళపాటు నువ్వు నా గడప తొక్కరాదు." అన్నాడు ప్రెసిడెంటు.

తుఫానులో చిక్కుకుపోయిన కుక్కపిల్లలా గజగజలాడిపొయ్యాడు జోగినాధం.

"అయ్యా ఆయ్యా! తమ చల్లని పాదాల నీడన బతుకుతున్నాను. కావాలంటే ఇక్కడే ఇప్పుడే కత్తితో పొడిచేసి చంపెయ్యండి. అంతేగాని నాకంత పెద్ద శిక్ష విధించకండి." బావురుమంటూ దొరగారి కాళ్ళపై పడిపొయ్యాడు జోగినాధం.

ప్రెసిడెంటు మళ్ళీ నవ్వాడు. తన శిష్యుడైన నక్క చూపిస్తున్న వినయానికి మెచ్చిన తోడేలు నవ్వులా ఉందా నవ్వు.

"నీ స్వామి భక్తి నాకు తెలీదా జోగినాధం? అగ్గిపుల్లే కదాని ఆర్పకుండా పడేస్తే అడివంతా అగ్గెట్టేస్తది. రాజకీయాల్లో అన్ని వైపులా కాచుకుని ఉండాలి. జాగర్తగా లేకపోతే రేపా కూలెదవలే కొంప ముంచుతారు. అంచేత నే చెప్పొచ్చేదేంటంటే.. నువ్వూళ్ళోకెళ్ళి ఆ గొడవల్లో దూరు. ఆవేశపడు. అవసరమైతే నన్నో నాలుగు తిట్టు. ఏదోక రకంగా ఆ కూల్జనాల విశ్వాసం సంపాదించు. వారిపై పట్టు సంపాదించి వారికి నాయకుడివైపో, నాగభూషణాన్ని పడగొట్టెయ్."

జోగినాధం మళ్ళీ ప్రెసిడెంటు కాళ్ళ మీద పడ్డాడు.

"ఆహాహా! తమరి బుర్రే బుర్రండి. లక్షల కోట్ల ఆలోచన చెప్పారు."

"అర్ధమైందిగా జోగినాధం? ఈ ఊళ్ళో నాకు ఎగస్పార్టీ ఉండకూడదు. ఉన్నా అది నా మనిషే అయ్యుండాల. అంచేత మన ప్లాన్లో ఎక్కడా తేడా రాకూడదు. ఈ క్షణం నుండి నువ్వూ నేనూ ఎగస్పార్టీ వాళ్ళం. నీకూ నాకు మధ్యన పచ్చ గడ్దేస్తే అది సర్రున మండాలా. ఎప్పటికప్పుడు అక్కడ కూపీలన్నీ పంతుల్తో నాకు చేరెయ్యి." గర్వంగా మీసాలు దువ్వుకుంటూ అన్నాడు ప్రెసిడెంటు.

"చి.. చి.. చిత్తం" వంగివంగి నమస్కారం చేస్తూ నిష్క్రమించాడు జోగినాధం.

పంతులుకి భయం వేసింది. అతనికి భయంకర కీకారణ్యంలో, అంతకన్నా భయంకరమైన క్రూరమృగాల మధ్యన ఉన్నట్లుగా అనిపించింది.

(picture courtesy : Google)