Saturday 3 August 2013

ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను


'బ్లాగా! అంటే ఏంటి?'

ఈ మధ్యకాలంలో నేను అనేకసార్లు ఎదుర్కొన్న ప్రశ్న ఇది. మొదట్లో బ్లాగంటే ఏంటో చెప్పటానికి ప్రయత్నించేవాణ్ని. తరవాత ఈ ప్రశ్న కొద్దిగా చికాగ్గా ఉండేది. తరవాత్తరవాత మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను.

అయితే ఇప్పుడో కొత్త సమాధానం ఇస్తున్నాను.

"బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో ఒకట్రెండు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను."

ఏమిటోయి నీ బ్లాగ్గోల? ఎందుకోయి ఈ అబద్దాలు?

వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు మెడికల్ కాలేజిలో మా బ్యాచ్ చాలా పాపులర్. అందుకు మా బ్యాచిలో ఎక్కువమందిమి గుంటూరు, విజయవాడ, హైదరాబాదుల్లో స్థిరపడటం ఒక కారణం. అంచేత మా క్లాస్మేట్ల పార్టీలు ఎక్కువగా జరుగుతుంటయ్. ఈ పార్టీలకి పెద్ద కారణం ఉండదు. అసలు విషయం.. హాయిగా, సరదాగా, మత్తుగా కబుర్లు చెప్పుకోవడానికి ఈ పార్టీల వంకతో కలుస్తుంటాం.

మనం ఎంత తెలివైన వాళ్ళమైనా జీవితంలో ఒక్కోసారి ఘోర తప్పిదం చేస్తుంటాం. అది మన ప్రారబ్దం. ఒక బలహీన క్షణాన నేనూ అట్లాంటి తప్పే ఒకటి చేశాను. ఒక పార్టీలో నా స్నేహితుడికి సెల్ ఫోన్లో నా బ్లాగ్రాతొకటి (సాంబారు.. ఒక చెరగని ముద్ర) చూపించాను.. చదివి వినిపించాను. అతగాడు శ్రద్ధగా విన్నాడు. బాగుందని మెచ్చుకున్నాడు. మిక్కిలి సంతసించితిని.

నాల్రోజుల తరవాత ఆ స్నేహితుడి ఫోన్.

"బిజీగా ఉన్నావా?"

"లేదులే. ఏంటి సంగతి?"

"ఏంలేదు. నా OP (అనగా out patients అని అర్ధం) ఇప్పుడే అయిపోయింది. నీదగ్గరకొస్తాను. మళ్ళీ వినిపించకూడదూ?"

"ఏంటి వినిపించేది?"

"అదే. మొన్నేదో సాంబారంటూ వినిపించావుగా!"

"ఓ! నువ్వు చెప్పేది నా బ్లాగ్గూర్చా?"

"ఓహో! దాన్ని బ్లాగంటారా?"

"అవును. నీకు నా బ్లాగ్ ఎడ్రెస్ చెబుతాను. నువ్వే చూసుకోరాదూ?"

"అదేంటి! బ్లాగులకి ఎడ్రెస్ కూడా ఉంటుందా! సర్లే. ఆ ఎడ్రెస్సేదో చెప్పు."

నే చెప్పబోతుండగా..

"ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ కేసొచ్చింది. మళ్ళీ చేస్తాను." ఫోన్ కట్టయింది.


తరవాత పార్టీలో ఆ మిత్రుడే పార్టీలో నా  బ్లాగ్రాత గూర్చి మిగిలినవారికి చెప్పాడు.

కొందరు ఆశ్చర్యపొయ్యారు.

"కంప్యూటర్లో తెలుగ్గూడా రాస్తారా! ఎలా రాస్తారు?"

ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాను. "లేఖిని అని ఒక టూల్ ఉంది. అదొక.. "

ఈలోపు వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకోడం మొదలెట్టారు.

"మీ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ ఇంకా రాలేదే? మినిస్టర్తో చెప్పించకపోయినావు? నీకు బాగా తెలుసుగా!"

ఆ విధంగా టాపిక్ మారింది. లేఖిని పోయింది.


ఆ తరవాత ఇంకో పార్టీలో ఇంకో మిత్రుడు.

"ఏంటి నువ్వు అదేదో బ్లాగులని రాస్తావుటగా?"

"అవును."

"ఎందుకు రాయటం?"

ఇబ్బందిగా అన్నాను. "పని లేక.. "

"అవున్లే. ప్రాక్టీస్ తగ్గిపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావ్? మొత్తానికి పన్లేక రాస్తున్నావన్నమాట!"

"అదికాదు. 'పని లేక' అనేది.. "

నా సమాధానం వినిపించుకోకుండా "హైదరాబాదులో స్థలాల రేట్లు పడిపోతయ్యంటావా? ఎంతైనా నువ్వు తెలివైనోడివి. బెజవాడంతా కొని  పడేశావు." అంటూ పక్కవాడితో మాట్లాట్టం మొదలెట్టాడు.


మరికొన్నాళ్ళకి ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.. తీవ్ర స్వరంతో అడిగాడు.

(మా పార్టీల్లో సెకండాఫ్ కొంచెం తీవ్రమైన వాతావరణం ఉంటుంది.)

"ఈమధ్య నువ్వు బ్లాగులంటూ ఏవో రాస్తున్నావంట?"

"అవును."

"అవెట్లా చదవాలి?"

"సింపుల్. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి.. "

"గూగుల్ సెర్చా! దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి?"

"నీకు నెట్ కనెక్షన్ ఉంది కదా?"

"ఉంది. కానీ కంప్యూటర్లోకి చూస్తుంటే నాకు కళ్ళు లాగేస్తాయి."

"మరప్పుడు నీకు చెప్పి ప్రయోజనమేమి?"

"మరదే ఎగస్ట్రాలంటే. అడిగిందానికి ఆన్సర్ చెప్పు. లేదా తెలీదని చెప్పేడువు." మావాడు ఆవేశపడ్డాడు.

తప్పు అతనిది కాదు. అందుకు వేరే కారణముంది!


ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.

"ఇప్పుడు చెప్పు. బ్లాగంటే ఏంటి?"

"బ్లాగా!" ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాను. ఆపై కొద్దిసేపు బుర్ర గోక్కున్నాను.

"సారీ! గుర్తు రావట్లేదు. బ్లాగంటే ఏంటో మర్చిపోయ్యాను."

"మరి నువ్వు రాస్తున్నావని ఎవడో చెప్పాడు?"

"నాగూర్చి ఎవడో చెప్పేదేంటి? నే చెప్పేదే నిజం. బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో బజ్జీలు, సాంబారంటూ ఒకట్రెండు పోస్టులు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను. వదిలేయ్!" అన్నాను.

"ఓ! అలాగా?"

హమ్మయ్య! ఏవిటిది? ఇప్పుడు మనసు ప్రశాంతంగా, హాయిగా అయిపోయింది! నాకిప్పుడు నా స్నేహితులకి ఏం సమాధానం చెప్పాలో బాగా అర్ధమైంది. ఇలాగే కంటిన్యూ అయిపోతే మంచిదని కూడా అర్ధమైంది!


(pictures courtesy : Google)