Tuesday 27 August 2013

CPM ఎక్కడ?


నిన్న 'హిందూ'లో CPM కార్యదర్శి రాఘవులు బొమ్మని చూసి ఆశ్చర్యపొయ్యాను. పిమ్మట చాలా రోజుల తరవాత పేపర్లో ఆయన బొమ్మని చూసినందుకు సంతోషించాను. ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో CPM బొత్తిగా వెనకబడిపోయింది.

'మేం భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అనుకూలం, రాష్ట్ర విభజనకి వ్యతిరేకం. రాష్ట్రాన్ని విడగొట్టేట్లైతే మేం అడ్డుపడం' అని ఒక ప్రకటన చేసేసి ఆ పార్టీ నాయకులు ఇంట్లో కూర్చున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన రాజకీయ విధానం. రాష్ట్రాలు కలిసే ఉండటం, కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, ఉన్న రాష్ట్రాల్ని విభజించడంపై CPM లో విధానపరమైన చర్చ జరిగినట్లు నాకు అనిపించడంలేదు.

భాషాప్రయుక్త రాష్ట్రాలే విధానం కలిగిన కలిగిన CPM, హిందీ రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసే ఉద్యమానికి శ్రీకారం చుడుతుందా? మరప్పుడు గూర్ఖాలాండ్ ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? కేవలం BJP చిన్న రాష్ట్రాలకి అనుకూలం కావున, CPM దానికి వ్యతిరేక విధానం తీసుకుందా? నేనైతే అలా అనుకోవట్లేదు.

దేశజనాభా పెరిగిపోతుంది. ప్రాంతీయంగా ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయి. రేపు విదర్భ విషయంలో కూడా జాతీయ పార్టీగా ఒక అభిప్రాయం, నిర్ణయం తీసుకోవలసిన అవసరం CPM కి ఉంది. ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా, మారుతున్న కాలానికి అనుగుణంగా తమ రాజకీయాలు స్పష్టంగా నిర్వచించవలసిన అవసరం ఆ పార్టీకి ఉంది.

ఇదేమీ లేకుండా.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటూ పిడివాదన తలకెత్తుకుంటే.. భవిష్యత్తులో ఆ పార్టీ కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. రాజకీయ అభిప్రాయాలు, నిర్ణయాలు గోడక్కొట్టిన మేకులా స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మార్పు అనేది రాజకీయాల్లో సహజం. ఇది ఆ పార్టీ నాయకత్వం ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది. అసలు ప్రజల అభిమానాన్ని చూరగొనే విషయంలో (తాము అనుకుంటున్న) బూర్జువా పార్టీలతో పోటీ పడే ఉద్దేశ్యం CPM కి ఉందా? లేదా?

మన రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. ఎందఱో మహానాయకుల్ని దేశానికి అందించిన ఘనచరిత్ర కమ్యూనిస్టు పార్టీది. సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు.. ఈ లిస్టు పెద్దది. ఎంతో చరిత్ర కలిగిన CPM ఇవ్వాళ రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తుంటే.. సాక్షీభూతంగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం మినహా.. ప్రజలని రాజకీయంగా కనీస స్థాయిలోనైనా ప్రభావితం చెయ్యలేని స్థితిలో కునారిల్లుతుంది. ఇదొక విషాదం.

పోస్టు సీరియస్ గా అయిపోతుంది. కావున సరదాగా ఒక జోక్ రాస్తాను. ఒకప్పుడు CPM పార్టీకి ధరలు పెరిగినప్పుడల్లా నిరసన ప్రదర్సనలు చేసే ఆనవాయితీ ఉండేది. ఈ ప్రదర్శనలకి చిరాకు పడ్డ కాంగ్రెస్ పార్టీ, రోజువారీగా ధరలు పెంచడం మొదలెట్టింది. రోజూ నిరసన తెలియజెయ్యడం ఏ పార్టీకైనా కష్టం కావున.. CPM ఆ పని నుండి వైదోలిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ CPM పై క్షేత్ర స్థాయిలో విజయం సాధించింది. పార్లమెంటరీ రాజకీయాల్లో ఎత్తుకు పైయ్యెత్తు వేసేవారిదే విజయం. రాజ్యం వీర భోజ్యం.

నేను ఇంతకు ముందు "కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం" అంటూ వ్యంగ్యంగా ఒక పోస్టు రాశాను. కామెంట్ల వర్షాన్ని ఎదుర్కొన్నాను. ఈ పోస్టులో మాత్రం అస్సలు వ్యంగ్యం లేదని మనవి చేసుకుంటున్నాను. రాఘవులు నిజాయితీని, నిబద్దతని ఎవ్వరూ ప్రశ్నించలేరు. నాకు వ్యక్తిగతంగా రాఘవులు అంటే గౌరవం. కానీ ప్రజలకి దూరంగా జరిగిపోయ్యి సిద్ధాంతాలతో పార్టీ నడపడం ఈ రోజుల్లో సాధ్యపడదు. ఈ విషయం CPM ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


(photo courtesy : Google)