Friday 23 August 2013

స్త్రీల పట్ల వివక్ష


సుబ్బు కాఫీ త్రాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.

"సుబ్బూ! స్త్రీ శక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తి." అన్నాను.

"గాడిద గుడ్డేం కాదు? దీన్నే 'లిప్ సర్విస్' అంటారు మిత్రమా." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అనగానేమి?" అడిగాను.

"పెదాలపై మాట ఒకటి, మనసులో భావం మరొకటి అని అర్ధం. భావజాలాన్ని మార్చుకోకుండా వాగాడంబరాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనమేమి?" అన్నాడు సుబ్బు.

"కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పవా?" చికాగ్గా అన్నాను.

"ఇవ్వాళ ఉద్యమాల్లో తమకి నచ్చని పురుష రాజకీయ నాయకులకి స్త్రీ వేషాలు వేసి ఊరేగిస్తున్నారు. అంటే సమాజంలో స్త్రీ స్థానం తక్కువ అని బహిరంగంగా ప్రకటించటమే." అన్నాడు సుబ్బు.

"దాందేముంది సుబ్బు! వాళ్లకి ఆ రాజకీయ నాయకుని పట్ల ఉన్న కోపంతో జెండర్ మార్చి వేషధారణ చేసి ప్రదర్శిస్తున్నారనుకోవచ్చు." అన్నాను.

"మరప్పుడు సోనియా గాంధీకి ప్యాంటూ, చొక్కా వేసి నిరసన తెలియజెయ్యాలి గదా? ఎందుకలా చెయ్యరు?" అడిగాడు సుబ్బు.

"నిజమే! ఎందుకలా చెయ్యరు?" ఆశ్చర్యపొయ్యాను.

"ఎందుకనగా.. మన సమాజంలో ఈ నాటికీ స్త్రీ కన్నా పురుషుడు అధికుడు అన్న భావం ఉండటం చేత. అందుకే పురుష రాజకీయ నాయకులకి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి తమ అసంతృప్తిని తెలియజేస్తారు. రాజకీయాల్లో ఉన్న స్త్రీకి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి నిరసన తెలియజెయ్యడం మాత్రం ఇంతవరకూ జరగలేదు." అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ! మరి ఈ విషయంలో ఇంతమటుకూ స్త్రీ సంఘాలు నిరసన తెలియజెయ్యలేదే?" అడిగాను.

"ఎవరి వాదన వారు చేసుకోవాలనుకోడానికి ఇదేమీ ఆస్థి తగాదా కాదు. ఒక సమాజ భావజాలానికి సంబంధించిన అంశం. స్త్రీలకి చదువులు, ఉద్యోగాలు అనవసరం అని కొందరు స్త్రీలే వాదిస్తారు. అలాగే స్త్రీల సమస్యల గూర్చి తపన పడ్డ గుడిపాటి చలం స్త్రీ కాదు. ఎవరి ఉద్యమం వాళ్ళే చేసుకోవాలంటే.. అప్పుడు పసిపిల్లలు, వృద్ధుల తరఫున ఎవరు ఉద్యమిస్తారు?" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు చెప్పింది ఒప్పుకుంటున్నాను." అన్నాను.

"మన చిన్నప్పటితో పోలిస్తే ప్రజల తలసరి ఆదాయం పెరిగిందే గాని.. తలలో ఆలోచనలు పెరగలేదనిపిస్తుంది. అతి చిన్న విషయమే అయినా.. ఒక చర్య ద్వారా తమలోని వికృత భావాజాలాన్ని బయట పెట్టుకుంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈ విషాదాన్ని నేను తట్టుకోలేను. రాత్రికి దినకర్ పంపిన glenfiddich తో ఈ సమాజం పట్ల మన నిరసన తెలియజేద్దాం." నవ్వుతూ అన్నాను.

"ఓ! తప్పకుండా." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)