Saturday 17 August 2013

రూప్ తెరా మస్తానా



'ఆరాధన'. ఈ సినిమా అనేక రకాలుగా ప్రత్యేకమైనది. 1969 లో హిందీ సినిమా ప్రేమికుల్ని ప్రేమ మైకంలో ముంచెత్తింది. ప్రేమ కథా చిత్రాలకి సరికొత్త ఒరవడి సృష్టించింది. ఒక సూపర్ స్టార్ ఆవిర్భానికి, ఇంకో సూపర్ సింగర్ పునర్జన్మకి కారణమైందీ సినిమా. ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా ఇక్కడ నేను రాయనక్కర్లేదు. వికీ చూస్తే చాలు. తెలిసిపోతుంది.

ఈ సినిమా ఆనాడు గుంటూరు విజయలక్ష్మి థియేటర్లో అమ్మానాన్నల్తో చూశాను. హిందీ సినిమాలు నాకు ఆట్టే అర్ధం కాకపోయినా.. ఆ సినిమాలు పంచరంగుల్లో (ఆ రోజుల్లో కలర్ సినిమాల్ని అలాగే పిలిచేవాళ్ళు) ఉంటాయి కావున నాకు నచ్చేవి. పాటలు కూడా బాగుండేవి.

ఆరాధన సినిమాలో హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తారు. ఆ తరవాత చలి కాచుకుందుకు మంట వేసుకుంటారు. అప్పుడు 'రూప్ తెరా మస్తానా' అనే పాట ఫుల్ స్వింగులొ మొదలవుతుంది. పాట విండానికి చాలా బాగుంటుంది. కానీ విషయమే అర్ధం కావట్లేదు. ఆ అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి అదేపనిగా ఎందుకలా చూస్తున్నాడు? ఆ అమ్మాయి అతన్నుండి ఎందుకలా చూపు తిప్పుకుంటుంది? హాల్లో జనాలేమో వేడి నిట్టూర్పులు. అసలేం జరుగుంతుందిక్కడ? ఏంటో, ఏమీ తెలిసి చావట్లేదు.

అందుకే ఈ విషయాన్ని అమ్మనడిగాను. అమ్మ కసురుకుంది.

"నోర్మూసుకుని సినిమా చూడు. నీవన్నీ దరిద్రపు డౌట్లు."

నా డౌటు అమ్మ దృష్టిలో ఎందుకంత దరిద్రపుదయిందో కొన్నేళ్ళకి గానీ అర్ధం కాలేదు! ఇట్లాంటి అడగకూడని ప్రశ్నలు వేసి అమ్మని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. ఇదే తరహా సీన్ ఆ తరవాత ప్రేమనగర్ అనే తెలుగు సినిమాలో కూడా చూశాను. కనీసం డౌట్ కూడా రానంతగా చండాలంగా ఉంటుందా సీన్!

కొన్ని పాటలు కొన్నాళ్ళు బాగుంటాయి. ఇంకొన్ని పాటలు చాన్నాళ్ళు బాగుంటాయి. అరుదుగా మరికొన్ని పాటలు ఎప్పుడు విన్నా బాగుంటాయి. అత్యంత అరుదుగా అతికొన్ని పాటలు విన్నకొద్దీ ఇంకాఇంకా బాగుంటాయి. స్కాచ్ విస్కీకి లాగా వీటి విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. 'రూప్ తెరా మస్తానా' స్కాచ్ విస్కీ కెటగిరీలొకి వస్తుందని నా అభిప్రాయం.

ఈ పాట రికార్డ్ చేసి నాలుగు దశాబ్దాలు దాటింది. SD బర్మన్ కి మాత్రమే ఈ పాటకి ఇంత గొప్ప ట్యూన్ ఇవ్వగలడు. కిశోర్ కుమార్ మాత్రమే ఈ పాటని ఇంత అద్భుతంగా పాడగలడు. ఆ రోజుల్లోని సంగీత దర్శకులు, గాయకులు గొప్ప ప్రతిభావంతులనే విషయం చెప్పడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. వినికిడి సరీగ్గా ఉంటే చాలు. అందుకే నేనా విషయాల జోలికి పోను.

ఆనాడు ఈ పాట కోసం వాడిన musical instruments చాలా ఆధునికమైనవి. ఆర్కెస్ట్రేషన్ కూడా ఈరోజే రికార్డ్ చేశారా అన్నంత ఫ్రెష్ గా ఉంటుంది. అంచేత ఆ రోజుల్లో ఈ పాట 'వెల్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్' అనిపిస్తుంది. ఇది నాకు ఆసక్తిని కలిగించింది. అప్పటిదాకా లెక్కలేనన్నిమెలోడీల్ని అలవోకగా మన మీదకి వదిలిన సంగీత గని SD బర్మన్, ఉన్నట్లుండి ఇంత మోడర్న్ పాట ఎలా చెయ్యగలిగాడు? ఇదేదో ఆలోచించదగ్గ విషయమే!

అందువల్ల ఈ పాట మీద రీసెర్చ్ మొదలెట్టాను. ఆరాధన సమయానికి SD బర్మన్ వృద్ధుడు. కావున ఆ సాక్సఫోన్లు, కాంగో డ్రమ్స్ ఆయనకి అంతగా పరిచయం ఉండకపోవచ్చు. ఎవరో కుర్రాడు ఈ పాటకి ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాడు. ఎవరా కుర్రవాడు? ఇంకెవరు? RD బర్మన్. అవును. ఈ పాట ఇంత బాగా రావడానికి కారకుడు జూనియర్ బర్మన్ అయ్యుంటాడు.

సీనియర్ (తండ్రి) డాక్టర్లు ఆపరేషన్లు చేసేప్పుడు జూనియర్ (కొడుకు) డాక్టర్ల సహకారం తీసుకుంటారు. ఇందుకు కారణాలు రెండు. ఒకటి తమ పని భారం తగ్గించుకోవడం, రెండు కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఇదే ప్రిన్సిపుల్ బర్మన్ ద్వయానిక్కూడా ఎందుకు వర్తింప చెయ్యరాదు? యురేకా! ఎంత గొప్ప ఇన్వెన్షన్! శభాష్! ఎంతైనా నేను చాలా తెలివైనవాడిని.
ఒకసారి సినీ సంగీత విమర్శకులు VAK రంగారావు గారితో చాలాసేపు కబుర్లు చెప్పే అదృష్టం నాకు కలిగింది. ఆయన సి. రామచంద్రకి వీరాభిమాని. SD బర్మన్ కి అభిమాని. ఆయన బర్మన్ సంగీత ప్రతిభ గూర్చి ఆనందంగా చెబుతుండగా.. నేను వెంటనే నా బర్మన్ నాలెడ్జ్ దుమ్ము దులిపాను (హమ్ కిసీ సే కమ్ నహీ).

"రూప్ తెరా మాస్తానా పాట  అంత గొప్పగా రావడానికి కారకుడు పంచమ్. సచిన్ దా కి ఆధునిక వాయిద్యాలపై అంతగా.. "

అయన నా మాటకి అడ్డు తగిలాడు.

"ఎవరు చెప్పారు?"

"ఎవరూ చెప్పలేదు. నేనే కనుక్కున్నాను." గర్వంగా చెప్పాను.

"యు ఆర్ రాంగ్. ఆ పాటలో RD కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంది. కానీ SD సంగీత జ్ఞానం ముందు RD ఒక లిల్లీపుట్."

నాకు రంగారావు గారు చెప్పేది అర్ధం కాలేదు. కానీ ఆయన నా పరిశోధనని తప్పు పట్టడం నచ్చలేదు.

"పంచమ్ లిల్లీపుట్ కావచ్చు. కానీ ఆ డ్రమ్స్.. " చెప్పబోయ్యాను.

"మీరు చెబుతున్న ఆ 'గొప్ప' సంగీత వాయిద్యాలని అక్కడ, అలా ప్రయోగింప చేసింది SD బర్మన్. ఆయనకి ఇష్టం లేకపోతె RD బర్మన్ చెయ్యగలిగిందేమీ లేదు. SD బర్మన్ ఈజే జీనియస్." గట్టిగా బల్ల గుద్దినట్లు అన్నారు రంగారావు గారు.

ఇప్పుడర్ధమైంది. ఈయన RD బర్మన్ కి ఈ పాటలో పైసా వాటా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అంచేత ఆయన SD బర్మన్ అభిమానాన్ని ఆయనకే ఉంచేసి నా రీసెర్చ్ ఫైండింగ్ నా దగ్గరే ఉంచేసుకున్నాను.


యూట్యూబ్ నుండి ఆ పాట ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.




(photos courtesy : Google)