Monday, 12 August 2013

ఎందుకిలా జరిగింది?


ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వ్యక్తి కన్నా సమాజం గొప్పది. ఏ వ్యవస్థకైనా సర్వకాల, సర్వావస్థలలో సమాజహితం మించిన పరమార్ధం లేదు. అలాగే రాజకీయాలు వ్యక్తి మనుగడకి, సమాజ పురోగతికి నిరంతరంగా దోహదపడుతూ ఉంటాయి.. ఉండాలి కూడా. ఏ దేశంలోనైనా రాజకీయాలకి ఇంతకు మించిన పవిత్ర కార్యాచరణ మరొకటి లేదు.

అమెరికావాడు అందలంలో విహరించినా, ఆఫ్రికావాడు అడుక్కు తింటున్నా అందుకు కారణం రాజకీయాలే. రాజకీయాలు రెండే రకాలు. ఒకటి ప్రజలకి మంచి చేసేవి, రెండు ప్రజలకి చెడు చేసేవి. ఇవన్నీ చాలా ప్రాధమికమైన విషయాలైనా, ప్రస్తుతం ఆంధ్రదేశంలో గోడల మీద రాసుకునే సుభాషితాల స్థాయికి దిగజారిపొయ్యాయి. ఏ సమాజానికైనా ఇంతకు మించిన విషాదం మరొకటి ఉంటుందనుకోను.

ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో (చాలామంది) తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని గట్టిగా నమ్ముతున్నారు. మంచిది. డిసెంబర్ తొమ్మిది ప్రకటన లాగానే ఆచరణలో ఆగిపోయిందనే అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణావారు ఖచ్చితంగా ఊరుకోరుగదా. వాళ్ళు మళ్ళీ ఉద్యమం మొదలెడతారు. అంటే పరిస్థితి కొద్దిరోజుల క్రితం జరిగిన CWC ప్రకటన స్థితికి వెళ్తుందే గానీ.. 1956 పరిస్థితి మాత్రం రాదు.

ఇప్పుడు ఇంత తీవ్రంగా స్పందిస్తున్న మన కోస్తాంధ్ర ప్రజలు ఆనాడు అవసమైనప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ ప్రశ్న నన్ను వేధిస్తుంది. తెలంగాణా ఏర్పాటే మా ఏకైక లక్ష్యం అంటూ ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీతో ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు మనం నిద్ర పొయ్యామా? ఈ రెండు ప్రధాన పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణా అంశం చొప్పించినప్పుడు మనం పెద్దగా పట్టించుకోలేదెందుకు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల మ్యానిఫెస్టోలు, పొత్తులు ఒక రాజకీయ అంగీకారానికి అత్యంత ముఖ్యమైనవని ఆనాడు ఎందుకు మర్చిపొయ్యాం? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి, మన ప్రాంత ప్రయోజనాలకి దెబ్బగొట్టే విధంగా అవతలవారితో అవగాహన కలిగించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ప్రశ్నించలేదు? పైగా తెలంగాణావారి ఓట్లు దండుకోడానికి మన నాయకుడు వేసిన చాణక్యుని ఎత్తుగడగా, గొప్ప రాజకీయ క్రీడగా మురిసిపోలేదా? అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలని మనం పట్టించుకోలేదన్న మాటేగా?

ఇప్పుడు రోడ్ల మీద కొచ్చిన వారు 'హైదరాబాదు మాది. దాన్ని మేమే అభివృద్ధి చేశాం.' అంటున్నారు. ఆ అభిప్రాయం కలిగి ఉండటం ఎంతమేరకు సబబు అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఇప్పుడు హైదరాబాద్ మీద ప్రేమ కలిగి ఉన్నవారికి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో ఎంతోవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటే (రాజకీయంగా ఒక్కో అడుగు తెలంగాణా వైపు పడుతుంటే) మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కనీసస్థాయిలో కూడా (కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చరికగా) ఉద్యమం ఎందుకు చెయ్యలేదు? నాయకులపై, వారి లాబీయింగ్ పై (ప్రజాస్వామ్యంలో 'లాబీయింగ్' అన్నది ఒక నీచమైన పదం) అచంచల విశ్వాసంతో మొద్దునిద్ర పోవడం ఏరకమైన రాజకీయ కార్యాచరణ?

'ఒక పార్టీ అధికారంలో రావడానికో, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికో మా హైదరాబాదు విషయంలో మేం రాజీపడే ప్రసక్తి లేదు. హైదరాబాద్ మాది. ఈ హైదరాబాదు అంశంపై మాకు ఖచ్చితమైన హామీ ఇస్తేనే మీకు మా ఓటు. లేదా మీరూ, మీ నాయకులు పొయ్యి ఏ గంగలోనైనా దూకండి.. మాకనవసరం.' అనే స్పష్టమైన వైఖరి మొదట్నుండి తీసుకుని ఉండాల్సింది. సీట్ల కోసం తెలంగాణావాద పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకి మన ఆంధ్రా ప్రాంతంలో డిపాజిట్లు కూడా రాకుండా చేసి చుక్కలు చూపించి ఉండాల్సింది. డెమాక్రసీలో ఓటుతోనే కదా బుద్ధి చెప్పేది? మనకి ఇంతకు మించి వేరే మార్గం ఉందా?

ఆ రకంగా చేసినట్లైతే దేశానికి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చి ఉండేవాళ్ళం కాదా? ('హైదరాబాదు విషయంలో ఆంధ్రావారితో రాజకీయం చేస్తే మాడు పగులుతుంది' అని). రాజకీయ పార్టీలు శూన్యంలో రాజకీయాలు చెయ్యవు. వారికి మన ప్రాంతప్రజల ఆకాంక్ష కుండ బద్దలు కొట్టినట్లు అర్ధమైనట్లయితే, వారి వ్యూహప్రతివ్యూహాలు అందుకు తగ్గట్టుగా రచించుకునేవారు. కానీ మనం ఏనాడూ అటువంటి స్పష్టమైన, నిర్దిష్టమైన పొలిటికల్ మెసేజ్ ఏ ఎలక్షన్లోనూ ఇవ్వలేదు. పైగా తెరాసతో పొత్తు పెట్టుకున్న పార్టీలక్కూడా దండిగా సీట్లు కట్టబెట్టాం.

'లేదు. లేదు. కేంద్రం తెలంగాణా ఇస్తుందని మేం అనుకోలేదు. అందుకే ఖాళీగా ఉన్నాం.' అంటే దాన్ని రాజకీయ అలసత్వం అంటారు. రాజకీయంగా ఏదీ 'అనుకోరాదు'. ముందే నిరసన తెలిజేస్తూ ఉండాలి. అదొక పవిత్రమైన విధి. అలా చెయ్యకపోవటం వల్లనే ఇప్పుడు నష్టం జరిగింది. అందుకే ఎవరైనా, ఎక్కడైనా తమ రాజకీయ అభిప్రాయాల్ని (మన హక్కులకి భంగం కలుగుతుందని అనుమానం కలిగినా చాలు) వీలైనంత గట్టిగా, బలంగా ప్రపంచానికి తెలియజెయ్యాలి. అలా చెయ్యకపోతే మన భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి.

మన ఆంధ్రా ప్రాంతం వాళ్ళు పార్టీలకి అతీతంగా ఎప్పుడైనా అట్లాంటి కార్యక్రమాలు చేశారా? చెయ్యలేదని నేను అనుకుంటున్నాను ( ఏం చేసినా మన నాయకులకి కలిగే లాభనష్టాలు లెక్కలెసుకునే చేశాం). చెయ్యవలసినప్పుడు ఏమీ చెయ్యకుండా ఆలస్యంగా మేలుకోవడం.. ఇల్లు కాలుతున్నప్పుడు ఫైర్ ఇంజన్ కోసం హైరానా పడటం వంటిది. అసలు ఇల్లే అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లైతే ఈనాడు మనకీ దుస్థితి దాపురించేది కాదు. పరిస్థితి ఇంత అగమ్యగోచరంగా ఉండేదికాదు.

(photo courtesy : Google)