Saturday 10 August 2013

ఇంకా పాత పాటేనా!


"నువ్వు నేరం చేశావని నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?" జడ్జి సార్వభౌమరావు కళ్ళద్దాల్లోంచి ముద్దాయిని చూస్తూ అడిగాడు.

అదొక క్రిమినల్ కేసు. ఆ కేసు విచారణ చాలా రోజులపాటు సాగింది. నిందితుడు సుబ్బయ్య. ప్రముఖ క్రిమినల్ లాయర్ మూర్తి డిఫెన్సు తరఫున వాదించాడు. ఆవేశంగా, బలంగా బల్ల గుద్ది మరీ కేసు వాదించాడు మూర్తి. ప్రాసిక్యూషన్ చార్జ్ షీటు పకడ్బందీగా ఫైల్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఎంతో పట్టుదలగా వాదించాడు. అనేక మంది సాక్షులు ఎక్జామినేషన్, క్రాస్ ఎక్జామినేషన్ చెయ్యబడ్డారు. ప్రాసిక్యూషన్, డిఫెన్సుల వాదప్రతివాదాలతో కోర్టు గదంతా సెగలుపొగలు గక్కింది!

జడ్జి గారి 'గిల్టీ' అన్న తీర్పు వినంగాన్లే నిందితుడు సుబ్బయ్య హతాశుడయ్యాడు. దిగాలుగా తన ప్లీడరు కేసి చూశాడు. ప్లీడర్ మూర్తి తన జూనియర్తో కాజువల్ గా ఏదో మాట్లాడుతున్నాడు. సుబ్బయ్యకి ఇప్పుడు విషయం బోధపడింది. తను మోసపొయ్యాడు. ఈ కేసులో మొదట్నుండి తనకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్షులు సాక్ష్యం చెప్పినప్పుడే జడ్జి సార్వభౌమరావు తనని నేరస్తుడని నమ్మేసి ఉంటాడు. మరిన్నాళ్ళు ఈ డిఫెన్సు ప్లీడరు అంతలా బల్ల గుద్దుతూ వాదించాడెందుకు? కేసులో పస లేదని.. ఖచ్చితంగా మనమే గెలుస్తామని నమ్మ బలికాడెందుకు?

నీకు శిక్ష పడే అవకాశం ఉంది. అని సూచనాప్రాయంగానైనా వాస్తవం చెప్పినట్లైతే మానసికంగా సిద్ధపడి ఉందునే! ఎంతో నమ్మాను. అడిగినంత ఫీజూ ఇచ్చాను. అయినా తనకి అసలు విషయం చెప్పకుండా కథ నడిపాడే! ఇది నమ్ముకున్న క్లయింటుని నట్టేట ముంచడం కాదా?

జడ్జి సార్వభౌమరావు సుబ్బయ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ అడిగాడు.

"నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?"

సుబ్బయ్య తన ప్లీడర్ వంక చూశాడు. ప్లీడర్ మూర్తి ముఖం అటువైపు తిప్పుకున్నాడు.

"ఉందయ్యా" చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు ముద్దాయి.

"చెప్పు" అడిగారు జడ్జ్ గారు.

"నేను అమాయకుడిని. నాకేం తెలీదు" స్థిరంగా అన్నాడు సుబ్బయ్య. ఆ ముక్క అక్కడ ఆ బోన్లో నిలబడి అలాగే అనడం సుబ్బయ్యకి వందోసారి.

జడ్జి సార్వభౌమరావు మొహం చిట్లించారు. ఆపై విసుక్కున్నారు. ఆ తరవాత హడావుడిగా తీర్పు చదివి వినిపించారు. శిక్ష విని ఖిన్నుడయ్యాడు సుబ్బయ్య. సుబ్బయ్యపై పెట్టిన సెక్షనుకది గరిష్టమైన శిక్ష. ఆకాశం విరిగి మీద పడినట్లు, విచ్చుకున్న భూమిలో కూరుకుపోయి పాతాళానికి జారిపోతున్నట్లుగా అనిపించింది సుబ్బయ్యకి.

సుబ్బయ్య దూరపు బంధువు కాంతయ్య. అతనికి కోర్టు వ్యవహారాల్తో పరిచయం ఉంది.

"ఏం సుబ్బయ్య? జడ్జి గారు ఏదైనా చెప్పుకొమ్మన్నప్పుడు నీ మీద ఆధారపడి అనేకమంది ప్రాణాలున్నాయని చెప్పొచ్చుగా. కనీసం చావుబతుకుల మీదున్న మీ నాన్న గూర్చైనా ఒకముక్క చెబితే శిక్ష తగ్గించి చెప్పేవాడుగా?" అడిగాడు కాంతయ్య.

"అలా బ్రతిమాలాలని నాకు తెలీదు సుబ్బయ్య మావా. మా ప్లీడరు ఒక్కమాట మీదనే ఉండమన్నాడు." దీనంగా అన్నాడు సుబ్బయ్య.

కాంతయ్యకి సుబ్బయ్యని చూసి జాలేసింది.

"నీకు నీ ప్లీడరు సరైన సలహా ఇవ్వలేదు సుబ్బయ్యా. నేను నిరపరాధిని అనే మాట కేసు వాదనలు నడుస్తున్నప్పుడు మాత్రమే పదేపదే చెప్పాలి. ఎప్పుడైతే జడ్జి నువ్వు నేరస్తుడవన్నాడో అప్పుడు నీ 'నిరపరాధి' అన్నమాటకి చెల్లు చీటీ వచ్చేసింది. కోర్టువారు సెక్షన్ల బట్టి శిక్ష వేస్తారు. అయితే ఆ సెక్షన్లోనే ఎంత శిక్ష వెయ్యొచ్చునో జడ్జికి విచక్షణాధికారం ఉంటుంది. అందువల్ల జడ్జిని తక్కువ శిక్ష వెయ్యమని ప్రాధేయపడినట్లైతే తగ్గించేవాడు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ అమాయకుణ్ణి అంటూ పాత పాట ఎత్తుకున్నావో.. అప్పుడు జడ్జి నీకిచ్చిన అవకాశం కోల్పోయావు. ఒక రకంగా జడ్జి తీర్పుని నువ్వు తప్పు పట్టావు. అందుకే ఆయన అంత చిరాకు పడ్డాడు." విడమర్చాడు కాంతయ్య.

"అసలిదంతా ఆ ప్లీడరు మూర్తి చేసిన మోసం. తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వు మాత్రం అమాయకుణ్ణి, నాకేం తెలీదు అన్న మాట మీదే నిలబడు అన్నాడు" పళ్ళు కొరికాడు సుబ్బయ్య.

 కాంతయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు.

చివరి మాట :

ఈ బుల్లి రాతలో పాత్రల పేర్లన్నీ రావిశాస్త్రి రచనల నుండి తస్కరించబడినవి.

(అందుకు నాకు బహు ఆనందముగా యున్నది.)

సుబ్బయ్య : అల్పజీవి
సార్వభౌమరావు : నిజం
ప్లీడరు మూర్తి : మాయ
కాంతయ్య : బల్ల చెక్క

కృతజ్ఞతలు :

ఆప్తమిత్రుడు మరియూ హైకోర్టు న్యాయవాది అయిన గోపరాజు రవితో నిన్న ఫోన్లో కొద్దిసేపు మాట్లాడాను. దాని ఫలితమే ఈ పోస్టు.

చివరి తోక :

ఈ పోస్టు చదువుతున్నప్పుడు ఇవ్వాల్టి ఆంధ్రా రాజకీయాలు గుర్తొస్తే సంతోషం.

(photo courtesy : Google)