Thursday, 8 August 2013

ఘంటసాల = మొహమద్ రఫీ


మంచి పాట అనగానేమి? నాకు తెలీదు. అయితే మంచి పాటలకి రంగు, రుచి, వాసన ఎలా ఉంటాయో మాత్రం తెలుసు. అవన్నీ ఒక్క ఘంటసాల పాటల్లోనే ఉంటాయి. పోస్టు కార్డు మీద మా ఇంటి ఎడ్రెస్ ఎంత ఖచ్చితంగా రాయొచ్చో.. అంతే ఖచ్చితత్వంతో మంచి పాటలకి కేరాఫ్ ఎడ్రెస్ ఘంటసాల అని రాయొచ్చునని నమ్ముతున్నాను.

నాకింకో నమ్మకం కూడా ఉంది. సంక్రాంతి పండక్కి అమ్మ చేసే అరిసెలు అత్యంత రుచికరంగా ఉంటాయి. అవి తింటుంటే 'జీవితమే మధురము' అనిపించేది. అప్పటికి నాకు పీచు మిఠాయి, సాయిబు కొట్లో నిమ్మ తొనల రుచి కూడా పరిచయమే గానీ.. అవేవీ అరిసెలకి సరి రావు. అందువల్ల సృష్టిలో అరిసెల కన్నా రుచికరమైనదేదీ లేదని గట్టిగా నమ్మాను.

ఒక విషయాన్ని తిరుగులేని వాస్తవంగా అంగీకరించినప్పుడు.. ఇంకే విషయాన్ని ఒప్పుకోటానికి ఇష్టపడం. ఇందుకు కారణం మన అభిప్రాయమే నిజమైనది అనే ఆత్మవిశ్వాసం లేదా అహంకార పూరిత అజ్ఞానం కారణం కావచ్చు. నాకీ రెండూ మెండుగా ఉన్నాయి కావున.. ఈ భూమండలము నందు ఘంటసాల దరిదాపుల్లోకొచ్చే గాయకుడు లేడనీ.. అమ్మ చేతి వంటతో పోల్చదగిన మధురమైన వంటకం మరేదీ లేదనీ (బల్ల గుద్దకుండానే) వాదించేవాణ్ని.

ఇలాంటి స్థిరమైన అభిప్రాయంతో ప్రశాంతంగా జీవిస్తున్న నా జీవితంలో ఓ రోజు ఉన్నట్లుండి కలకలం రేగింది. ఒక (శుభ) దుర్దినాన నాన్న బజార్నుండి నేతి మైసూరుపాకం కొనుక్కొచ్చాడు. ఘుమఘుమలాడుతున్న ఆ మైసూరుపాకం నుండి ఒక ముక్క తుంచి నా నోట్లో పెట్టింది అమ్మ. ఏమి ఈ రుచి! ఇంత అద్భుతముగా యున్నదేమి! నా ప్రమేయం లేకుండానే మైసూరుపాకం ముక్క నోట్లో కరిగిపోయి పొట్టలోకి జారిపోయింది. అదంత తొందరగా కరిగిపోయినందుకు మిక్కిలి విచారించాను. ఇంకోముక్క నోట్లో వేసుకున్నాను. ఈ సృష్టిలో ఇంత గొప్ప రుచి ఉన్నట్లు ఇన్నాళ్ళు నాకెందుకు తెలీలేదు? తెలీనందుకు కించిత్తు చింతించాను. అటు తరవాత మైసూరుపాకం నాకిష్టమైన పదార్ధాల లిస్టులోకొచ్చి చేరింది.

నా చిన్నప్పుడు బావిని, బావిలో నీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. భూమికి బొక్క పెడితే నీళ్ళెందుకొస్తాయబ్బా! అని తీవ్రంగా ఆలోచించేవాడిని. అమ్మ నీళ్ళు తోడుతున్నంతసేపు ఆ బావిలో నీళ్ళని చూస్తూ సంబర పడుతుండేవాణ్ని. ఒకసారి రామకోటి ఉత్సవాల సందర్భంగా అగ్రహారంలో ఉన్న రామనామ క్షేత్రంకి వెళ్లాను. అక్కడ అందరూ దేవుడికి మొక్కుతుంటే.. నేను మాత్రం గుడి మధ్యలోనున్న కోనేరుని ఆశ్చర్యంగా చూస్తుండిపొయ్యాను. ఒక్కసారిగా వంద బావులు కలిపి చూసిన భావన కలిగింది.. భీతి కూడా కలిగింది. అందుకే అమ్మ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాను.

ఆ తరవాత కృష్ణ పుష్కరాలకి బెజవాడ వెళ్లాను. అక్కడ కృష్ణానదిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపొయ్యాను. ఈ ప్రపంచంలో ఇన్ని నీళ్ళున్నాయా! నాకు కృష్ణమ్మ సృష్టిలోని అనంత జీవకోటికి తల్లిగానూ.. స్నానమాచరిస్తున్న భక్తులు ఆవిడ బిడ్డల్లాగానూ అగుపించారు. నాకానాడు ఒక సత్యం బోధపడింది. ఈ అనంతవిశ్వంలో మనం రేణువులం మాత్రమే. మనం బ్రతకడం కోసం దేవుడే నీరు, నిప్పు, ఆహారం.. ఇత్యాది రూపాల్లో మనకి అందుబాటులో ఉంటాడు.. కనిపెట్టుకునీ ఉంటాడు.. వెధవ్వేషాలేస్తే బుద్ధీ చెబుతాడు.


నేను మొదటిసారి మైసూరుపాకం తిన్నపుడు, మొదటిసారి కృష్ణానదిని చూసినపుడు కలిగిన అనుభూతే.. ఆ తరవాత మొదటిసారి మొహమద్ రఫీ పాట విన్నప్పుడు కలిగింది. చాలా ఏక్సిడెంటల్ గా మొహమద్ రఫీ వినడం తటస్థించింది. అది బైజూ బావ్రా సినిమాలోని 'ఓ దునియా కే రఖ్ వాలే' పాట. పరాకుగా వినడం మొదలెట్టిన నేను.. కొన్ని క్షణాల తరవాత ఆసక్తిగా వినడం మొదలెట్టాను. పాట వింటున్నకొద్దీ ఆర్ద్రతకి గురైనాను. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు. ఆ రాళ్ళ సంగతేమో కానీ నేను మాత్రం పూర్తిగా కరిగి నీరైపొయ్యాను. సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను అంతటి భావోద్వేగానికి గురవ్వడం నాకే ఆశ్చర్యం కలిగించింది.

ఆ రోజు రఫీ నాలో కలిగించినవ అలజడి ఇంతంత కాదు. అంతలోనే ఏమూలో ఒక చిన్న అనుమానం. స్వీట్ల దుకాణంవాడు రుచి కోసం ఇచ్చే శాంపిల్ ముక్క మంచిది ఇస్తాడు. తీరా ప్యాక్ చేసేప్పుడు నాసిరకం సరుకు కట్టి మోసం చేస్తాడు. ఆ మోసం ఇంటికెళ్ళి చూస్తేగానీ అర్ధం కాదు. అంచేత అనుమాన నివృత్తి కోసం రఫీ పాడిన మరికొన్ని పాటలు విన్నాను. సందేహం లేదు.. ఈ రఫీ సామాన్యుడు కాదు. ఇతగాడు మన ఘంటసాల సహాపంక్తిన కూర్చుండబెట్టడానికి అన్ని విధాల అర్హుడు.

అటుతరవాత నాలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. ఈ ప్రపంచంలో కృషి ఉంటే ఏదైనా సాధించగలం అంటారు. కానీ కృషి ఉన్నా సాధించలేనివి కొన్ని ఉన్నాయి. దాన్నే వృధాప్రయాస అని కూడా అంటారు. సముద్రంలో నీటిని కొలవలేం. ఆకాశానికి హద్దు కనుక్కోలేం. ఘంటసాల, రఫీల ప్రతిభని అంచనా వెయ్యలేం. ఇవన్నీ చెయ్యబూనటాన్నే 'వృధాప్రయాస' అంటారని అనుకుంటున్నాను.


నీలాకాశం, చల్లని వెన్నెల, చిరుజల్లు, కోయిలమ్మ గానం, పసివాని నవ్వు.. ఇవన్నీ సృష్టిలో భగవంతుని అద్భుతాలు. వీటిని ఆస్వాదించడానికి టైం లేనివాడు బ్రతికి ప్రయోజనం లేదు. తుచ్చమానవజాతి యొక్క బ్రతుకు ఎడారిలో ఇసక కొండల్లా నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయ్యే ప్రమాదాన్ని నివారించడానికి ఆ దేవుడిచే మనకోసం పంపబడ్డ 'గంధర్వులు ఆన్ స్పెషల్ డ్యూటీ' రఫీ అండ్ ఘంటసాల అని నా నమ్మకం.

వీళ్ళిద్దరూ సినిమాల్లో పాడినందుకు నిర్మాతల దగ్గర ఏంత సొమ్ము తీసుకున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం వారికి ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనంతగా ఋణపడిపోయాను. సైకియాట్రిస్టులు మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు మార్గాలు ఎంచుకోమంటారు. రఫీ, ఘంటసాలల పాటలు వింటూ ఉండడం అనేది మానసిక ప్రశాంతతకి నేషనల్ హైవే వంటిదని నమ్ముతున్నాను.

నువ్వు చక్కగా చదువుకున్నావా? గుడ్. మంచి ఉద్యోగం చేస్తున్నావా? వెరీ గుడ్. సమాజహితం గూర్చి కూడా ఆలోచిస్తున్నావా? వెరీవెరీ గుడ్ (అనాదిగా మంచి చదువుతో సమాజహితానికి లంకె కుదురుతుంది గానీ 'మంచి' వ్యాపారంతో లంకె కుదరదు). నువ్వు ఘంటసాల, రఫీల పాటలు వినడం లేదా? అయితే నీ బ్రతుకు వృధా. అర్జంటుగా ఎందులోనన్నా దూకి చావు!


ఇప్పుడు నన్నెంతగానో  ఆనందింపచేసిన 'బైజూ బావ్రా' పాట గూర్చి రాస్తాను. నౌషాద్ సంగీతం వహించిన ఈ సినిమా 1952 లో విడుదలైంది. భరత్ భూషణ్, మీనాకుమారి హీరో హీరోయిన్లుగా చేశారు. (కొంతకాలం పాటు బైజూ బావ్రా అనేది మన జయభేరి సినిమాకి హిందీ వెర్షన్ అనే భ్రమలో ఉన్నాను).

అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్ సేన్. ఆ రాజ్యంలో తాన్ సేన్ అనుమతి లేనిదే ఎవరూ పాడరాదు. అలా పాడినందున బైజూ తండ్రిని భటులు కొడతారు. ఎప్పటికైనా తాన్ సేన్ మీద ప్రతీకారం తీర్చుకోమని బైజూని కోరుతూ తండ్రి మరణిస్తాడు. బైజూ ఒక పడవ నడిపేవాని కూతురు గౌరీ (మీనాకుమారి) తో ప్రేమలో పడతాడు. బైజూ సంగీత గురువు తన శిష్యుడు శోకంతో ఉన్నప్పుడు అద్భుతంగా పాడటం గమనిస్తాడు. బైజూని వెతుక్కుంటూ వచ్చిన గౌరీని పాము కాటేస్తుంది.

గౌరీ మరణించిందనుకుని దుఃఖంలో దేవుణ్ని ఉద్దేశిస్తూ పాడటం మొదలెడతాడు బైజూ. గొప్ప కళాకారుల జీవితాలకి కష్టాలు, కన్నీళ్లు అంటిపెట్టుకునుంటాయి. బహుశా ఇదొక ఆనివార్యమైన స్థితేమో. (రాజుల మెప్పు కోసం రాజప్రసాదాల్లో మంద్రస్థాయిలో శాస్త్రీయ కూనిరాగాలు తీసే కడుపునిండిన కళాకారులు ఇందుకు మినహాయింపు).

మీరు నేను "నందుని చరిత - ఘంటసాల ఘనత" అంటూ రాసిన పోస్ట్ చదివే ఉంటారు. అక్కడ కాశీ కూడా అంతే! ఆవేశం, ఆవేదన కలిగి గొంతు పగల కొట్టుకుంటూ పాడతాడు. ఇక్కడ బైజూ కూడా దుఃఖంతో రోదిస్తూ పాడిన పాట 'ఏ దునియా కె రఖ్ వాలే'. దేవుణ్ని వేడుకుంటూ, కించిత్తు నిందిస్తూ, రోదిస్తూ.. పిచ్చివాడిలా (అన్నట్లు 'బావ్రా' అంటే పిచ్చివాడు అని అర్ధం) తిరుగుతూ పాడిన పాట ఇది.

ఇంతకుముందు "మధుబాల డార్లింగ్" అనే పోస్టులో 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అనే పాటకి నేను చేసిన అనువాదంలో చాలా తప్పులు దొర్లాయి. అందుకు కారణం నెట్లో ఆ పాటకి ఇచ్చిన ఆంగ్ల అనువాదం! అసలు భాష తెలీకుండా కొసరు భాషలోంచి తర్జుమా చేస్తే ఇట్లాంటి అనర్ధాలే సంభవిస్తాయి. కావున ఈసారి తెలుగు అనువాదం చేసే సాహసం చెయ్యను. మీరే అర్ధం చేసుకొండి.


ఇప్పుడు నౌషాద్ ఆలి గూర్చి రెండు ముక్కలు. నౌషాద్ మనం మెచ్చిన అనేకమంది సంగీత దర్శకులకి అభిమాన సంగీతకారుడు. ఉదాహరణకి మన ఎస్. రాజేశ్వరరావుకి నౌషాద్ అంటే అమితమైన ఇష్టం. నౌషాద్ బాణీలు ఎక్కువగా శాస్త్రీయ సంగీత వరసల్ని ఆధారం చేసుకుని ఉంటాయి. నౌషాద్ సంగీతంలో నాకు మరీమరీ నచ్చే అంశం ఆయన orchestration. ఆయన వాడే ప్రతి instrument గాయకుల గొంతుతో (vocals) పెనవేసుకుపోతుంది. ఇది నాకు చాలా విశేషంగా తోస్తుంది. ఈ పాట జాగ్రత్తగా వింటే మీరు కూడా నా పాయింట్ ఒప్పేసుకుంటారు.

'బైజూ బావ్రా' లోని ఈ పాట స్థాయి భారతదేశంలో అతితక్కువ పాటలకి మాత్రమే ఉందని నా నమ్మకం. ఈ పాట ఇక్కడ ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.(photos courtesy : Google)